Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeజాతీయంఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు

43 మంది మృతి.. ఆస్తి నష్టం..

ఈశాన్య రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. 15కు పైగా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు 7లక్షల మంది జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. 43 మంది మరణించారు. అసోంలోని 21 జిల్లాలు వరదల బారినపడ్డాయి. 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రోడ్లు, రైలు తదితర సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి.

నైరుతి రుతుపవనాల రాకతో కుండపోత వర్షాలు పడుతున్నాయి. సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో బాధితులను హెలికాప్టర్లలో సమీప పాక్యోంగ్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. వివిధ ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న 1,700 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిక్కింలోని లాచెన్‌లోని ఛతెన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు సైనికుల ఆచూకీ లభించట్లేదు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన 23 మంది సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. తీస్తా నదిలో వాహనంతోపాటు 8 మంది కొట్టుకుపోయారు.

10 రోజుల్లో జోరు వానలతో 552 కొండచరియలు విరిగిపడ్డాయి. ఇందులో ఐదుగురు చనిపోయారు. 152 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అసోంలో వరద బాధితుల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు నడుస్తున్నాయి. 31,212 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మణిపూర్‌లో 1.64 లక్షల మంది వరదల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. 35,143 ఇళ్లు పాడైపోయాయి.

వరద పరిస్థితులపై అసోం, సిక్కిం సీఎంలు, మణిపూర్‌ గవర్నర్‌తో ప్రధాని మోదీ సమీక్షించారు. సహాయం చేస్తామని భరోసా కల్పించారు. వరదల్లో చిక్కుకొని, కొండచరియలు విరిగిపడి అస్సాంలో 17 మంది, అరుణాచల్‌ప్రదేశ్‌లో 11 మంది, మేఘాలయలో ఆరుగురు, మిజోరాంలో ఐదుగురు, సిక్కింలో ముగ్గురు, త్రిపురలో ఒకరు చనిపోయారు. బిహార్‌లోని సివాల్‌ జిల్లాలో ఏడుగురు మృతి చెందారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News