Tuesday, October 28, 2025
ePaper
Homeరాజకీయంరేవంత్ పాలనలో తెలంగాణ తిరోగమనం

రేవంత్ పాలనలో తెలంగాణ తిరోగమనం

పన్నుల భారం, ఆర్థిక క్షీణతపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పన్నుల విధానంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుక్రవారం ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతూ, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని వెనక్కి నెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఊరట కలిగించేలా పన్నులను తగ్గించారు. కానీ, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నులను భారీగా పెంచి, సాధారణ ప్రజలు, వ్యాపార వర్గాలు, చిన్న మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం మోపుతోంద‌న్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రాధాన్యతలు పూర్తిగా తప్పిపోయాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి డబ్బుల సంచులు మోసే పనిలో ఉన్నారు. కానీ, ప్రజల అసలు సమస్యలు – ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాల లోపం, రైతుల కష్టాలు – ఇవేమీ పట్టించుకోవడం లేదు. రేవంత్ పాలనలో తెలంగాణ తిరోగమన దిశలో అడుగులు వేస్తోంది అని ఆరోపించారు.

గతంలో రూ.7,100 కోట్ల టాక్స్ వసూలయింది. కానీ, రేవంత్ పాలనలో వసూళ్లు రూ.6,900 కోట్లకు మాత్రమే చేరాయి. అంటే, ప్రభుత్వ పన్నుల రేట్లు పెరిగినా, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో ఆదాయం తగ్గింద‌ని వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుండగా, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి అసమర్థత కారణంగా ఆర్థిక వ్యవస్థ వెనకబడుతోందని ఆయన విమర్శించారు. ఇది రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు హెచ్చరిక సంకేతం అని హరీశ్ రావు హెచ్చరించారు. హరీశ్ రావు చేసిన ఈ విమర్శలు, ముఖ్యంగా పన్నుల పెంపు మరియు ఆర్థిక క్షీణత అంశాలు, రాబోయే రాజకీయ చర్చల్లో ముఖ్య అంశాలుగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై ఆర్థిక వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాల పేరుతో దాడి పెంచుతుండగా, కాంగ్రెస్ ఈ ఆరోపణలకు ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News