- వివరాలు వెల్లడించిన నిపుణులు..
గ్రీన్ టీని చాలామంది కేవలం బరువు తగ్గించే పానీయంగా మాత్రమే భావిస్తారు. కానీ అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను గ్రీన్ టీ కలిగి ఉంది. గ్రీన్ టీ లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ ముఖ్యంగా కాటెకిన్స్ శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే L-థియానిన్ కారణంగా మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చక్కెర కలిపిన టీకి బదులుగా గ్రీన్ టీని తీసుకోవడం డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఎంపికగా భావిస్తున్నారు. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలపై ఎలా ప్రభావం చూపుతుందో పరిశోధనలు వివరిస్తున్నాయి. మానవ పరీక్షలు, మెటా-అనాలిసిస్‌ల ఆధారంగా గ్రీన్ టీ గ్లూకోజ్ నియంత్రణకు పలు విధాలుగా సహాయపడుతుందని తేలింది.
గ్రీన్ టీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఈజీసీజీ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలు ఇన్సులిన్‌ను సమర్థంగా ఉపయోగించుకునేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతాయి.
పరిశోధనల ప్రకారం గ్రీన్ టీ వాడకం ఫాస్టింగ్ చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే HbA1c స్థాయిలు కూడా తగ్గుతాయని గుర్తించారు. ఇవి దీర్ఘకాలికంగా చక్కెర నియంత్రణకు కీలక సూచికలు. బరువు నియంత్రణలో కూడా గ్రీన్ టీ కొంతవరకు సహాయపడుతుంది.
చక్కెర కలిపిన గ్రీన్ టీ తీసుకుంటే దాని ప్రయోజనాలు తగ్గిపోతాయి. కొంతమందిలో ఇందులో ఉన్న కెఫీన్ కారణంగా చక్కెర స్థాయిలు తాత్కాలికంగా పెరగవచ్చు లేదా నిద్రలో అంతరాయం కలగవచ్చు. కొన్ని మందులతో ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
