విశ్వ సృష్టి, నిలయ, లయకారకులు విరాట్ విశ్వకర్మ పరమాత్మ
లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణ మహోత్సవం
విశ్వ కళా విరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య
విశ్వ కళ్యాణ మహోత్సవాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వైభవోపేతంగా నిర్వహించారు. విశ్వాన్ని సృష్టించిన విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుల వారి విశిష్టతను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత(Guinness World Records Recipient), సహస్ర మహోత్సవ సామ్రాట్ శ్రీ శాంతికృష్ణ సేవా సమితి(Sri Shantikrishna Seva Samiti) ఈ దృఢ సంకల్పం తీసుకుంది. వారి సారథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో.. అమెరికాలోని కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్(Kavin Friendly Foundation), కెనడాలోని తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా(Telugu Alliances of Canada) సహకారంతో ఈ ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తిచేశారు.
శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత విశ్వ కళా విరాట్ డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య.. మహోత్సవాల విశిష్టతపై ప్రసంగించారు. ‘పంచ వేదాలు, ఉపనిషత్తుల సారాంశం ఆధారంగా సమస్త మానవాళి, సృష్టిలోని అన్ని జీవ, నిర్జీవ రాశులను, పంచభూతాలను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు సమస్త దేవతలను, అండ, పిండ, అఖిలాండకోటి బ్రహ్మాండాన్నంతా సృష్టించినవారు విరాట్ విశ్వకర్మ పరమేశ్వరులవారు. ఇట్టి సత్యత్వాన్ని ప్రపంచంలోని అన్ని జాతులు, అన్ని మతాల వారు, సమస్త మానవాళి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని అన్నారు.
మానవ నాగరికత మొదలైన తొలినాళ్ల నుంచి నేటి వరకు విశ్వకర్మ జాతీయులు జనజీవన విధానాలకు అందిస్తున్న అనేక రకాల సేవల గురించి శాంతి కృష్ణ చెప్పారు. వాటిని మరింత బలోపేతం చేసి మానవ మనుగడకు మార్గదర్శకమైన పంచకర్మలకు (మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ), విశ్వకర్మ జాతీయలకు పూర్వవైభవాన్ని అందించేలా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం మహోన్నతమైన ఈ విశ్వ కళ్యాణ మహోత్సవాన్ని అంబరాన్ని తాకే సంబరాలతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు.
లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ అన్ని దేశాల ప్రజలు విభేదాలు విస్మరించి ఒకరికొకరు పరస్పర అభిమానాలతో, అన్యోన్యతతో, మానవ సమైక్యతను చాటాలని సూచించారు. సమస్త జనులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సత్ సత్సంకల్పంతో విశ్వ సృష్టికర్త విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుల వారిని ధ్యానిస్తూ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే నానుడి వాక్కును, వాస్తవికతను తెలుసుకోవాలని కోరారు. మానవ జన్మకు పరిపక్వత చేకూర్చుకోవాలని, కుల మతాలకతీతంగా నిర్వహించుకున్న ఈ మహోత్సవాల్లో అన్ని మతాల వారు పాల్గొనడం శుభసూచకమని అన్నారు. వేద పండితులు, దేవ బ్రాహ్మణ పండితోత్తములు, తెలంగాణ రాష్ట్ర అర్చక పురోహిత సంఘం వారి నేతృత్వంలో మహోన్నతమైన ఈ విశ్వ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు శాంతి కృష్ణ ఆచార్య వివరించారు.
విశ్వ ఖ్యాతిని ఆర్జించిన ఈ మహోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనా చారి, గాయత్రి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కాంతేంద్ర స్వాముల వారు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ మద్దూరి ఆదిత్య శర్మ, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎ.పద్మాచారి, సీసీఎస్ ఏసీపీ కె.ఎం.కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృ సంఘం అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మధుసూదనాచార్యులు, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నరసింహారెడ్డి, దేవాలయాల ప్రతిష్టాచార్యులు డాక్టర్ పోలోజు భాస్కరాచార్యులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పెందోట శ్రీనివాసచార్యులు, వివో అధ్యక్షుడు డాక్టర్ సుదర్శనాచార్య, పెంటా శ్రీనివాసచార్యులు, డాక్టర్ లంకేశ్వరాచార్యులు, మన దేశంతోపాటు 8 దేశాల ప్రతినిధులు, కళాకారులు, వివిధ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా స్థానిక కళాకారులు పాల్గొన్నారు. మహోన్నతమైన ఈ విశ్వ కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగానే కాకుండా అంతర్జాలం ద్వారా ఆయా దేశాల్లో ప్రజలు తిలకించడానికి అవసరమైన అత్యంత ప్రతిష్టాత్మక ఏర్పాట్లను చేశారు.
