హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్(Governor ) జిష్ణు దేవ్ వర్మ 76వ క్షయరోగ (TB) సీల్ సేల్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, “టిబి సీల్ సేల్ కార్యక్రమం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించాలనే మన అందరి నైతిక బాధ్యత” అని అన్నారు.
టిబి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ముఖ్యంగా యువత, కళాకారులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు, విద్యాసంస్థలు ఈ యత్నంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. “టిబి ముక్త్ భారత్ అంటే టిబిని కేవలం అరికట్టడం కాదు, పూర్తిగా నిర్మూలించడం,” అని ఆయన స్పష్టం చేశారు. టిబి అవగాహన, పరీక్షలు, పోషక సహాయం, పరిశోధన రంగాల్లో తెలంగాణ టిబి సంఘం చేస్తున్న కృషిని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రశంసించారు. ప్రతి జిల్లాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల కింద హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రాలను అందించే మార్గాలను అన్వేషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానా కిషోర్ (IAS), రాజ్‌భవన్ ఉన్నతాధికారులు, డా. బి. సాయి బాబు (రిటైర్డ్ అదనపు డైరెక్టర్, మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్, ఏపీ ప్రభుత్వం మరియు ట్రస్టు బోర్డు సభ్యుడు, టిబి అసోసియేషన్), డి. బాలచంద్ర (హానరరీ జనరల్ సెక్రటరీ, టిబి అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ), డా. ఏ. రాజేశం (జాయింట్ డైరెక్టర్ టిబి మరియు అధికారిక హానరరీ సెక్రటరీ, టిబి అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ), టిబి అసోసియేషన్ సభ్యులు, వైద్య నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
