Wednesday, March 4, 2026
Homeఆరోగ్యంNutrition | పౌష్టికాహారం.. మహాప్రభో..

Nutrition | పౌష్టికాహారం.. మహాప్రభో..

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు (Government Schemes) పెట్టినా, ఎన్ని లక్షల కోట్లు వెచ్చించినా ప్రజలను పౌష్టికాహార లోపం నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో కోట్లాది మంది ఈ లోపంతోపాటు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచ జనాభాలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల్లో 20 శాతం వరకు ఇండియా(India)లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి (UNO) ఎప్పటినుంచో చెబుతోంది. ప్రజలు ఏ మేరకు పౌష్టిక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు.

మన దేశంలో గత 3 దశాబ్దాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహార అలవాట్లు మారిపోయాయి. సాగు పెరగడంతోపాటు వ్యవసాయ రంగం(Agriculture)లో సాంకేతిక పరిజ్ఞానం చోటుచేసుకుంది. దీంతో ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. అయినా ఇప్పటికీ దేశంలో 15 శాతం మంది జనాభాకు ఆకలి బాధలు (Hunger Problems) తప్పడంలేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 115 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచి(Global Hunger Index)-2019లో ఇండియాది 102వ స్థానం. దేశంలో ఇప్పటికే దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలు పౌష్టికాహార సమస్యలతో సతమతమవుతున్నారు.

- Advertisement -

ఇందులోని 15 నుంచి 45 ఏళ్ల వయసు మహిళల్లో 51 శాతం మంది అత్యంత బలహీనంగా ఉంటున్నారని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక తెలిపింది. చాలా మంది రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 70 శాతం మంది పౌష్టికాహారం లభించక రకరకాల సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి. 5 ఏళ్లలోపు పిల్లల్లో దాదాపు 40 శాతం మంది తక్కువ బరువుతో పుడుతున్నారు. వారిలో ఆరేడు శాతం మంది పుట్టిన ఐదేళ్లలోపే మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తు న్నాయి. రాజ్యాంగం జీవించే హక్కును కల్పించింది.

అలాంటిది.. కళ్లైనా సరిగ్గా తెరవని పసిగుడ్డులకు సరైన ఆహారం అందక చనిపోతే దానికి బాధ్యత వహించాల్సింది పాలకులే. తల్లీబిడ్డకు పౌష్టికాహారం అందివ్వకపోవడం పాలకుల బాధ్యతారాహిత్యం కిందకే వస్తుంది. అంటే.. పాలకులు ఏమీ చేయట్లేదని కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. లక్షల కోట్లు వెచ్చించారు. అయినా ఆశించిన ఫలితాలు లభించడం లేదు. కొత్త చట్టాలను ప్రవేశపెట్టకపోతేపోయారు. ఉన్న పథకాలను ఏ మేరకు అమలుచేస్తున్నారో, అర్హుల్లో ఎంత మందికి అందిస్తున్నారో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

నిశితంగా పరిశీలించి, పరిశోధిస్తే ఈ పథకాల నిధులను అక్రమ మార్గాలకు ఎలా మళ్లిస్తున్నారో వెలుగులోకి వస్తుంది. పర్యవేక్షణ లోపం కారణంగా తల్లీబిడ్డకు అందా ల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతున్న విషయం ఎన్నో సార్లు బయటపడ్డా పటిష్టమైన చర్యలు లేకపోవడంతో నిరాటంకంగా కొనసాగుతోంది. భారత్‌లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా పౌష్టికాహార లోపం పెచ్చరిల్లిపోతోందనే చెప్పొచ్చు. భారత్‌లో పౌష్టికాహార లోపంలో ప్రధానంగా సూక్ష్మపోషకాల ఆహార సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.

1975లోనే.. ఆరేళ్లలోపు పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందించేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన అంగన్‌వాడీ కేంద్రాలు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. ఆ కేంద్రాలకి సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిపై చర్యలు చర్యలు తీసుకుంటాం.. పునరావృతం కాకుండా చూస్తామంటున్నారే తప్ప ఆచరణలో జరగడం లేదు.

పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలు కలిగిన బియ్యాన్ని అందించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని సన్న బియ్యాన్ని ఈ పథకం ద్వారా అందిస్తోంది. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చిన దొడ్డు బియ్యాన్ని తినలేక అమ్ముకునేవారు. దీంతో దళారులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. పథకాలు, ఉద్దేశాలు అన్నీ సక్రమంగా ఉన్నార సంతృప్తి కల్పించేలా కన్పిస్తున్నా ఆచరణకు వచ్చేసరికి కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో కొత్త పథకాల గురించి ఆలోచించకపోయినా.. ప్రస్తుతం ఉన్న పథకాలను సవరించి, పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తే కొంతవరకైనా లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రజలకు పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతమైన భారతదేశం వర్ధిల్లుతుంది.

  • కామిడి సతీష్ రెడ్డి

- Advertisement -
RELATED ARTICLES

Latest News