- నిబంధనలు ఉల్లంఘించిన జి.ఎన్.ఎం నర్సింగ్ కళాశాలలపై విచారణ ప్రారంభం..
- నాణ్యమైన నర్సింగ్ విద్య కోసం కఠిన చర్యలు అవసరం
రాష్ట్రంలో నర్సింగ్ విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక 2025 సెప్టెంబర్ 9న “నర్సింగ్ విద్యలో అక్రమాలు” అనే శీర్షికతో వార్త కథనాన్ని ప్రచురిం చింది. ఆ వార్తపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం స్వాగతార్హమని సామాజిక సంస్థలు, విద్యా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని జి.ఎన్.ఎం నర్సింగ్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహణ కొనసాగిస్తున్నాయనే ఆరో పణల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు కమిటీ ఏర్పాటు చేయ డం నర్సింగ్ విద్యా ప్రమాణాల పరిరక్షణకు ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.
క్రిస్టియన్ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మాసారం ప్రేమ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా పరిగణించి దర్యాప్తు ప్రారం భించింది. ఒకచోట అనుమతులు తీసుకుని మరోచోట కళాశా లలు నడపడం, ఒకే భవనంలో అనేక నర్సింగ్ పాఠశాలలను నిర్వహిం చడం, తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అర్హత కలిగిన అధ్యాపక సిబ్బంది లేకుండా విద్యాసంస్థలను కొనసాగించడం వంటి అంశాలు కొన్ని కళాశాలల్లో గుర్తించబడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 40 మంది అధికా రులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నర్సింగ్ పాఠశాలలపై తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన తొమ్మిది విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ప్రతి సంస్థపై రూ.5 లక్షల చొప్పున జరిమానాలు విధించే ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడైంది.
నర్సింగ్ విద్యా నాణ్యతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా నర్సింగ్ విద్యాసంస్థలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించి, నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. నాణ్యమైన నర్సింగ్ విద్య అందితేనే ఆరోగ్య రంగానికి నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులోకి వస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.
