Friday, October 3, 2025
ePaper
Homeబిజినెస్పైపైకి బంగారం, వెండి ధరలు

పైపైకి బంగారం, వెండి ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మంగళవారం రికార్డులు బద్దలుకొట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.458 పెరిగి రూ.1,10,047 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. వెండి కూడా 14 ఏళ్లలో అత్యధిక రేటును తాకింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా డాలర్ బలహీనత నిలిచింది. అమెరికాలో తాజాగా వెలువడిన ఉద్యోగాల గణాంకాలు అంచనాలను తీవ్రంగా నిరాశపరిచాయి. ఆగస్టులో ఊహించిన 75,000 కొత్త ఉద్యోగాల బదులు కేవలం 22,000 మాత్రమే నమోదవ్వడంతో నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి పెరిగింది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం బలపడింది. డాలర్ ఇండెక్స్ ఆరు వారాల కనిష్ఠానికి పడిపోవడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మళ్లారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మంగళవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,804గా నమోదైంది. ఇదే సమయంలో, గోల్డ్ ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఆగస్టులో ఒక్క నెలలోనే 233 మిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు వచ్చాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

మరోవైపు, సెప్టెంబర్ 17న జరగనున్న అమెరికా ఫెడ్ సమావేశంపై మార్కెట్ల దృష్టి నిలిచింది. వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల కోత విధించే అవకాశం 91 శాతం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే ద్రవ్యోల్బణ నివేదికలు కూడా ఫెడ్ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశముందని భావిస్తున్నారు. టెక్నికల్ విశ్లేషణ ప్రకారం, బంగారం ధరకు రూ.1,08,040 వద్ద మద్దతు ఉండగా, రూ.1,08,950 వద్ద నిరోధం ఉందని మెహతా ఈక్విటీస్ నిపుణుడు రాహుల్ కలాంత్రీ అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News