- ఇది ఎంతో మహిమాన్వితమైనది..
- ఇష్టకామేశ్వరి దేవి పవిత్ర మందిరం..
- నల్ల మల్ల కొండలో ఎన్నెన్నో అద్భుతాలు..
శ్రీశైలం క్షేత్రంలో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఈ అమ్మవారిని దర్శించాలంటే అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నుదురు తాకితే మెత్తగా ఉంటుంది. ఎందరో భక్తులకు అనుభవంలోకి వచ్చిన ఈ అద్భుతానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
నల్ల ‘మల్లన్న’ కొండలో ఎన్నో అద్భుతాలు!
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాల్లో శ్రీశైలం దేవస్థానం ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి వెలసిన శ్రీశైలం కొండ మహత్తరమైనది. మోక్షాన్ని ప్రసాదించే శిఖర దర్శనంతో పాటు ఈ పరిసరాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం. అయినప్పటికీ కొందరు సాహసం చేసి ఈ అద్భుతాలను తిలకిస్తుంటారు. అలాంటి ఓ అద్భుతమైన ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భక్తుల అభీష్టాలు నెరవేర్చే ఇష్టకామేశ్వరి!
భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో ఉన్న ఆలయం ఒక్క శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఈ యాత్ర అత్యంత సాహసంతో కూడినది. ఎంతో గుండె ధైర్యం, పూర్వ పుణ్య ఫలం ఉంటే తప్ప అమ్మవారిని దర్శించుకోలేరు.
ఇష్టకామేశ్వరి ఆలయం విశిష్టత
శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరిక నైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతీదేవికి ప్రతిరూపంగా ఇష్ట కామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలసి ఉన్నారని భావిస్తారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే పూజలందుకున్న ఈ అమ్మవారిని నేడు సామాన్య ప్రజలు కూడా దర్శించుకుంటున్నారు. అయితే ఆ సంఖ్య చాలా పరిమితం.
ఆకట్టుకునే ఇష్టకామేశ్వరి స్వరూపం
శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల కొండల్లో ఒక గుహలో వెలసి ఉన్న ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్ష మాలతో తపోభంగిమలో, చిరు మందహసంతో అమ్మవారు కనిపిస్తారు. చీకటిగా ఉన్న గుహలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఈ గుహ పరిసర ప్రాంతాల్లో కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
