Wednesday, February 11, 2026
Homeకరీంనగర్Gangula Kamalakar | కేసీఆర్‌కు సిట్ నోటీసులిస్తే ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టే

Gangula Kamalakar | కేసీఆర్‌కు సిట్ నోటీసులిస్తే ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టే

  • గంగుల కమలాకర్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు (కేసీఆర్) సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టేనని తీవ్రంగా మండిపడ్డారు.

- Advertisement -

కేసీఆర్‌పై కక్ష సాధింపు ధోరణితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పక్కనబెట్టి తెలుగు సీరియల్‌లా రోజుకో నోటీసు, రోజుకో విచారణ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోతే ఇలాంటి నోటీసులు, విచారణల పేరిట నాటకాలు ప్రారంభిస్తాయని అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడల్లా జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టేందుకు నోటీసులు జారీ చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిందన్నారు.

ఇది డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని స్పష్టం చేశారు.ఫోన్ టాపింగ్ అంశంలో ముఖ్యమంత్రి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజా భద్రత దృష్ట్యా పోలీస్ శాఖకు చెందిన అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలు చేపడతారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో అప్పట్లో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అధికారులే ఉన్నారని, ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.

కేసీఆర్‌ను ఏం చేయలేకపోయిన దేశ ప్రధాని ముందు రేవంత్ రెడ్డి ఏమి చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును ఇబ్బంది పెట్టిన విధానాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు ఎలా తీర్పు ఇచ్చారో చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. రానున్న మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News