గచ్చిబౌలిలో నివాస అనుమతితో 5 స్టార్ హోటల్
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్‌లో టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి కుంభకోణం?
నిబంధనలు తుంగలో, ‘బ్లూమ్ హోటల్’కు రెసిడెన్షియల్ ఓసీ
ఉన్నతాధికారుల మౌనంపై ప్రశ్నలు!
జీహెచ్ఎంసీ (Ghmc) శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం మరోసారి అవినీతి అక్రమాలతో వార్తల్లోకెక్కింది. చట్టాలను(Acts), మునిసిపల్ నిబంధనలను (Municipal Rules) అంగటిలో సరుకులా మార్చి, టౌన్ ప్లానింగ్ (Town Planning) అధికారులు అక్రమ నిర్మాణదారులకు (Illegal Constructions) వత్తాసు పలకడం ఇప్పుడు గచ్చిబౌలిలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నివాస భవనంగా అనుమతి పొందిన స్థలంలో ఏకంగా వాణిజ్య సముదాయాన్ని(హెూటల్‌ను) (Hotel) నిర్మించినా క్షేత్రస్థాయి తనిఖీలను పక్కనపెట్టి భారీగా ముడుపులు తీసుకొని రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నివాసానికి అనుమతి.. నడుస్తున్నది ‘బ్లూమ్ హెూటల్'(Bloom Hotel)..
ఆంధ్రప్రదేశ్ హౌజింగ్ బోర్డ్ కాలనీ, హెచ్ఐజి-ఏ, గచ్చిబౌలి ప్రాంతంలోని సర్వే నం 131, ప్లాట్ నం 44, 45లో ఉన్న వివాదాస్పద భవనానికి సంబంధించిన అక్రమాల పర్వం ఇది.

అసలు అనుమతి..
బిల్డింగ్ పర్మిట్(BP నం 0245/GHMC/SLP/2024-BP) ప్రకారం ఈ నిర్మాణం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే
ఆమోదించారు.
క్షేత్రస్థాయి వాస్తవం..
ప్రస్తుతం ఆ భవనం “బ్లూమ్ హెూటల్” అనే పూర్తి స్థాయి వాణిజ్య (Commercial) హోటల్‌గా నడుస్తోంది.
నిబంధనల ఉల్లంఘన..
వాణిజ్య అవసరాలకు బిల్డింగ్ వినియోగం జరుగుతున్నప్పటికీ శేరిలింగంపల్లి జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కళ్లు మూసుకొని.. అది నివాస భవనం అన్నట్లుగా ఓసీ (ప్రొసీడింగ్స్ నం 38-49/GHMC/SLP/2024-OC) జారీ చేశారు.
లక్షల్లో ముడుపులు.. చట్టాన్ని చుట్టేసిన అధికారులు..
ఒక భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (ఓసీ) జారీ చేయాలంటే 1955 జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఆమోదించిన ప్లాన్, భవన వినియోగం, సెట్ బ్యాక్‌లు, పార్కింగ్ మొదలైనవన్నీ యథాతథంగా ఉన్నాయని టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలి. కానీ.. ఈ వ్యవహారంలో ప్లాన్‌ను పూర్తిగా ఉల్లంఘించారు. నివాస భవనం కాస్తా కమర్షియల్ హెూటల్‌గా మారినా అధికారుల నివేదిక మాత్రం దానికి విరుద్ధంగా ఉండటం చూస్తే దీని వెనక భారీ ఎత్తున ముడుపుల బేరం నడిచిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. లక్షల రూపాయల లావాదేవీలు జరిగితే తప్ప నిబంధనలను అంత బరితెగించి ఉల్లంఘించరని విమర్శకులు మండిపడుతున్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న ముఖ్యమైన డాక్యుమెంట్ల నంబర్లు..
OC 50: 3849/GHMC/SLP/2024-OC
BP 50: 0245/GHMC/SLP/2024-BP
స్థలం..
సర్వే నం 131, ప్లాట్ నం 44, 45, హెచ్ఐజీ-ఏ, ఆంధ్రప్రదేశ్ హౌజింగ్ బోర్డ్ కాలనీ
చట్ట పకారం చర్యలకు డిమాండ్..
ముడువుల కోసం ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కి అక్రమాలకు పాల్పడిన శేరిలింగంపల్లి జోన్ టౌన్ ప్లానింగ్ అధికారుల అధికార దుర్వినియోగానికి, అవినీతికి, బరితెగింపునకు ఇది నిదర్శనం. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్, అవినీతి నిరోధక శాఖ తక్షణమే సమగ్ర విచారణ జరపాలి. ఓసీని రద్దు చేసి అక్రమ వాణిజ్య వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
