- మాయమాటలు చెప్పి మైనర్ విద్యార్థినిని మోసం చేసిన వైనం..
- రహస్యంగా తాళికట్టిన దుర్మార్గం..
- ఘట్ కేసర్ లో వెలుగు చూసిన ఘటన..
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడే దారి తప్పాడు. పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి, రహస్యంగా తాళి కట్టాడు. ఈ ఉదంతం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్(27)అనే వ్యక్తి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికను తరచూ లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే బాలికను మోసగించి, ఎవరికీ తెలియకుండా పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన బాలిక మెడలో పసుపుతాడు ఉండడాన్ని గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీసింది. దీంతో ఆ బాలిక విషయాన్ని తల్లికి వివరించింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, బయట జరిగే విషయాలు తమకు సంబంధం లేదంటూ ప్రిన్సిపాల్ చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు ఉపాధ్యాయున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
