తెలంగాణ బీసీ జేఏసీ కన్వీనర్(BC JAC Convener)గా డాక్టర్ గటిక విజయ్ కుమార్ (Gatika Vijay Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బీసీ జేఏసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) గురువారం నియామక పత్రం అందించారు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన విజయ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడి(Perika Sangham President)గా ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు (Senior Journalist) అయిన ఆయన పలు సామాజిక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
హైదరాబాదులోని అశోక హోటల్‌లో జరిగిన తెలంగాణ బీసీ జేఏసీ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని (BC Movement) బలోపేతం చేయడంపై చర్చించారు. స్థానిక సంస్థల్లో (Local Bodies) 42% రిజర్వేషన్లు సాధించడంతోపాటు చట్ట సభల్లో కూడా బీసీ రిజర్వేషన్లు సాధించి రాజ్యాధికారంలో వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోవాలని నిర్ణయించారు. త్వరలోనే బీసీ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ రథయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించాలని నిర్ణయించారు.
