- నిధులు లేక నిలిచిన పారిశుద్ధ్య నిర్వహణ
- డీజిల్ లేక ఆగిన చెత్త సేకరించే ట్రాక్టర్
- ట్రాక్టర్ డీజిల్కు డబ్బులు లేవు
- రూ.50వేలు అప్పు చేసి మోటార్లు బాగుచేసాం..
- బిల్లులు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం
- బండాపోతుగల్ గ్రామ కార్యదర్శి వివరణ
తెలంగాణ రేజింగ్ నెంబర్1 అని ప్రభుత్వం ప్రచారం ముమ్మరంగా చేస్తుంటే…పల్లెల్లో మాత్రం కనీసం పారిశుద్ధ్య నిర్వహణ చేయలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీలకు నిధులు లేక బిల్లుల రాకపోవడంతో పరిపాలనా అధికారులు పనులు పక్కన పెట్టి చోద్యం చూస్తున్న దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో పారి శుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ పంచాయతీలకు ట్రాక్టర్లు కేటాయించి వాటి ద్వారా చెత్త సేకరణ చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వాలు మారిన తరువాత పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగి సిన నెలలు గడుస్తున్నా పల్లెల్లో పారిశుద్ధ్య పనులు అటకెక్కాయి. అధికారులు నిధులు లేవని, బిల్లులు రావడం లేదని అప్పులు చేసి మౌలిక సదుపాయాల నిర్వహణ చేయాల్సిన పరిస్థితి ఉందని చేతులెత్తేస్తున్న పరిస్థితి ఏర్పడింది.” అందుకు నిదర్శనమే

చిలిపిచేడ్ మండలంలోని బండాపోతుగల్ గ్రామంలో డీజిల్ లేక నడిరోడ్డుపై నిలిచిన చెత్త సేకరించే ట్రాక్టర్”..
బండాపోతుగల్ గ్రామంలో శుక్రవారం వీధుల గుండా చెత్త సేకరించి వెళ్తుండగా డీజిల్ అయిపోయి మార్గమధ్యలోనే ఆగిపోయింది గ్రామ పంచాయతీ ట్రాక్టర్. ఉదయం సేకరించిన చెత్త ట్రాక్టర్ లోనే పెట్టి డీజిల్ అయిపోయిందని రోడ్డుపైనే నిలిపిన సిబ్బంది సాయంత్రం వరకు కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్న కొందరు ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాలలో చెత్తను పడవేస్తూ పారిశుధ్యాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. చెత్త చెదారంతో ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయడంతో గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. చెత్తను సేకరించే ట్రాక్టర్లో చెత్తను వేయకుండా ఇష్టానుసారంగా చెత్తను బహిరంగ ప్రదేశంలో వేస్తున్న వారిపై పై అధికారులు చర్యలు తీసుకొని గ్రామస్తులు రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చెత్త ట్రాక్టర్ నిలిచిపోయిన విషయమై “ఆదాబ్ ప్రతినిధి” గ్రామ కార్యదర్శి ఆనంద్ ను వివరణ కోరగా గ్రామంలో మంచి నీటి సరఫరా చేసే బోరు మోటార్లు కాలిపోయినందున రూ.50వేలు అప్పుచేసి మరమ్మతు చేయించాను. ఇప్పుడు ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితిలో లేమని, బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సమాధానం ఇవ్వడం గమనార్హం.