Tuesday, March 3, 2026
Homeసాహిత్యంNagoba Jatara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర

Nagoba Jatara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర

జనవరి 18 నుంచి 24 వరకు నిర్వహణ

నాగోబా.. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర(Tribal Festival)ల్లో ఒకటి. రాష్ట్ర పండుగ(State Festival)గా గుర్తింపు పొందిన ఈ వేడుకలో సర్పజాతిని పూజించడమే ప్రత్యేకత. అమావాస్య రోజు ఆరాధ్య దైవం నాగోబా(శేషనారాయణమూర్తి) పురి విప్పి నాట్యమాడతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా రాత్రి 7 గంటల నుంచి 12 గంటల మధ్యలో గిరిజన పూజారులకు ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల విశ్వాసం. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. గోండుల దేవత.

- Advertisement -

నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామం(Keslapur Village)లో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కానీ పండగ రోజు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 18 నుంచి 24 వరకు నిర్ణీత రోజుల పాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. ఏటా పుష్యమాస అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం.

నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రుడికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుం పూరైందని చెపుతారు. ఆ తర్వాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ.

ఆ తర్వాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి.. గోదావరిలోనే సత్యవతి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని(పేథికొరియాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. ఏటా పుష్య మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం.

నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే(Mesram Dynasty) నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు. వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిన మేస్రం వంశస్థుల్లోని కటోడా దివాకర్‌కి, ఘాడియా సంకేపాయిలర్ వాడే శాఖల వారు కేస్లాపూర్ జాతరకు 16 రోజుల ముందు పుష్యమాస పౌర్ణమికి ఒక రోజు ముందు తమ కులదైవాన్ని పుష్య అమావాస్య రోజున అభిషేకించడానికి పవిత్ర గోదావరి జలం తేవడానికి కాలినడకన బయలుదేరి వెళతారు.

కేస్లాపూర్‌కు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న కలమడుగు మండలం సమీపాన ఉన్న గోదావరి నదిలో హస్త మడుగు వరకు అరణ్యం గుండా నడచి వెళ్లి గోదావరి జలం కలశంతో తీసుకుంటారు. హస్త మడుగులో గిరిజనుల పూర్వీకులు స్నానం చేస్తుండగా నాగదేవత ప్రత్యక్షమై దర్శనమిచ్చిందనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్ర జలంగా గిరిజనులు భావిస్తుంటారు. పుష్య పౌర్ణమి నాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలం లోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే.

ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తర్వాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు(దుగుడు) ఉన్నాయి.

ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. ఇచ్చోడ మండలం సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు మాత్రమే నాగోబా కోసం కుండలు తయారుచేయడం ఆచారంగా వస్తోంది. పుష్య మాసంలో నెలవంక కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిల్ల వంశస్థుడైన కుమ్మరి ఇళ్లకు వెళ్లి కుండలు తయారుచేయాలని కోరతారు. వంటల కోసం రెండు పెద్ద కుండలు, (కాగులు), వాటిపై కప్పిపెట్టేందుకు పాత్ర(చిప్పలు), దీపాంతలు, నీటి కుండలు కలిపి తయారీకి ఆర్డర్ ఇస్తారు.

మేస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని(Ganga Water) తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. కేస్లాపూర్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లిలో ఆగి, అక్కడ వెలసిన ఇంద్రాదేవికి సామూహికంగా పూజలు జరుపుతారు. ఇక్కడి నుంచి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద నాలుగు రాత్రులు, ఒక పాకలో మూడు రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి, పది కిలోమీటర్ల దూరంలోని సిరికొండ చేరుకుంటారు.

సరిగ్గా పుష్య అమావాస్య రోజున కలశం భద్రపరిచిన మర్రి చెట్టు దగ్గర బావి నీరు మట్టి కలిపి ఒక పుట్టను తయారుచేసి ఆలయం పక్కన ఉన్న పూల మందిరాన్ని ఆ మట్టితో అలికి అమావాస్య అర్థ రాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు. గోదావరి నది నుంచి తెచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్య క్రమాలను నిర్వహిస్తారు. ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవ ధాన్యాలను తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు.

నవ ధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటికీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్ట మీది రుమాలు ‘పైకెత్తినట్లు’ కనిపిస్తే పూజా కార్యక్రమాలను ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగ దేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేస్లాపూర్‌లో నాగోబా దేవుడి వద్దకు తీసుకెళతారు. ఆమె చేత ఆ దేవుడికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కీయ్‌వాల్’ అంటారు. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనక వెదురు బుట్టలో పూజా సామాగ్రిని ఉంచుకొని కాలినడకన బయలుదేరతారు. కేస్లాపూర్‌లోని నాగోబా గుడిని చేరుకుంటారు.

పరిచయం చేయాల్సిన వధువులను ‘భేటి కొరియాడ్’ అని పిలుస్తారు. పూజలకు ముందు నాగోబా దేవుడి దగ్గరకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌‌లోని (బోడుందేవ్) జాతర అయ్యాక ఎవరి గృహాలకు వాళ్లు వెళతారు. గతంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించాడు.

ఈ సంఘటనతో ఉలిక్కి పడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్‌ను ఆదిలాబాద్ జిల్లాకు పంపగా కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ను ప్రొఫెసర్‌ 1942లో మొదట నిర్వహించాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.

ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో జనవరి 18 నుంచి 8 రోజుల వరకు నిర్వహించనున్నారు. మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌ పటేల్‌, పెద్దలు చిన్ను పటేల్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు, మెస్రం వంశీయులు నిర్వహించే మహా పూజలతోపాటు రోజువారీ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • రామకిష్టయ్య సంగనభట్ల
- Advertisement -
RELATED ARTICLES

Latest News