- శ్రీనగర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఢిల్లీ పేలుడు కేసులో ఇప్పటివరకు 6గురు అరెస్టు
- ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్న ఎన్ఐఏ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లత సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్ఐఏ పట్టుకుంది. గురువారం శ్రీనగర్ లో వీరిని అరెస్ట్ చేసింది. దీంతో ఈ దాడితో సంబంధం ఉన్న మొత్తం అరెస్టులు 6కి పెరిగాయి. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్న సంగతి తెలిసిందే. జిల్లా సెషన్స్ జడ్జి, పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన ఆర్డర్ల మేరకు నలుగురు నిందితులను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్లో అదుపులోకి తీసుకున్నారు.
వారిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనై, జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, ఉత్తర ప్రదేశ్లోని లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ ఇంకా, జమ్మూ కాశ్మీర్లోని షోపియన్కు చెందిన ముఫ్టీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేగా గుర్తించారు. వీరందరూ ఢిల్లీ బ్లాస్ట్ లో ముఖ్యమైన పాత్ర పోషించారని దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పేలుడుకు ఉపయోగించిన కారు ఎవరి పేరున రిజిస్టర్ అయిందో అతనైన(అమీర్ రషీద్ అలీ)ని, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదికి సాంకేతిక సహాయం అందించిన డానిష్ అలియాస్ జాసిర్ బిలాల్ వాని లను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో పూర్తి కుట్రను వెలికితీసే ప్రయత్నాలలో భాగంగా వీరిద్దరినీ ఇంటరాగేట్ చేస్తోంది. కాగా, ఈ పేలుడు ఘటన జరిగిన వెంటనే కేంద్ర హెూం మంత్రిత్వ శాఖ దీనిపై దర్యాప్తును ఎన్ఐఏ కి అప్పగించింది. దాడికి కారణమైన గ్రూపులోని ప్రతి సభ్యుడిని గుర్తించి అరెస్టు చేయడానికి ఏజెన్సీ వివిధ రాష్ట్ర పోలీసు దళాలతో కలిసి పనిచేస్తోంది. నవంబర్ 10న ఢిల్లీలోని నేతాజీ సుభాష్ మార్గ్ ముష్కరమూకలు జరిపిన పేలుడులో 15 మంది మరణించారు.
