- కొనుగోలు కేంద్రాల వద్ద వానకు కొట్టుకుపోయిన ధాన్యం
- తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..
- ప్రభుత్వాన్ని వేడుకుంటున్న బాధిత అన్నదాతలు
చిలిపిచేడ్ మండలంలో అన్నదాతలు ఆరుగాలం పడిన కష్టం అంతా వర్షార్పణం అయ్యింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం రైతులు ఆగమయ్యారు. అరగంటలో నోటి కాడికి వచ్చిన ముద్ద తడిసిపోయిందని తల్లడిల్లుతున్నారు. మండల కేంద్రాలతో పాటు శీలంపల్లి, సోమక్కపేట,ఫైజాబాద్, చండూర్, చిట్కూల్, ఫైజాబాద్, బండాపోతుగల్, అజ్జమర్రి, గంగారం, జగ్గంపేట గ్రామాల్లోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. తేమ శాతం ఎక్కవగా ఉందని నిర్వాహకులు చెప్పడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టారు.

రాత్రి కురిసిన కుండపోత వర్షంతో ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ఆరబెట్టిన ధాన్యం వాన వరదకు కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. రైతులు ధాన్యం ఒక దగ్గరకు చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరపెట్టిన ధాన్యం కొట్టుకుపోవడనికి సరైన వసతులు లేకపోవడమేనని వాపోతున్నారు. కేంద్రాల్లో కొనుగోళ్లు జాప్యం వల్ల ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసిముద్దయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయడంతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..
