అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BRAOU)లో చదివే ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (Prof Ghanta Chakrapani, Vice Chancellor) అన్నారు. ఇన్‌ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్(Infinx Healthcare Pvt.Ltd) సహకారంతో శుక్రవారం విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీల సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రతి నెలా ఒక జాబ్ మేళా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాను ప్రత్యేకంగా 2024, 2025 బ్యాచ్‌లలో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం నిర్వహించామని వర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆ సంస్థ అధికారులు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను జారీ చేశారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి, EMR&RC డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. ఇన్‌ఫింక్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు మనోహర్ రామగల్ల, సాయి కృష్ణ, నవదీప్ సాయి ఉద్యోగ మేళాకు ఇంటర్వ్యూ బోర్డు సభ్యులుగా వ్యవహరించారు.
