Monday, March 16, 2026
Homeవరంగల్‌రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ..

రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ..

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం గాంధీ భవన్ లో మొగిలి సునీత రావు దగ్గరి నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కమలాక్షి రాజన్, మయూరి సింగ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ..ఒక దేశం లేదా రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందిందా లేదా అన్నది అక్కడి మహిళల స్థితిని బట్టి తెలుస్తుందని చాలా మంది అంటారు. మహిళలు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యలో ముందుకు వెళితేనే రాష్ట్రం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది.

- Advertisement -

ఈ ఆలోచనతోనే నేడు తెలంగాణలో మన ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో మహిళల సంక్షేమానికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల లక్షలాది మంది మహిళలు ప్రయాణం మాత్రమే కాకుండా తమ ఆత్మగౌరవాన్ని కూడా పెంచుకుంటున్నారు.

పెరిగిన గ్యాస్ ధరల భారాన్ని తగ్గించేందుకు అర్హులైన కుటుంబాలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. అలాగే అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మన ప్రభుత్వం లక్ష్యం కేవలం సంక్షేమం మాత్రమే కాదు, మహిళలను ఆర్థికంగా బలమైన నాయకులుగా తీర్చిదిద్దడం కూడా. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను బలోపేతం చేస్తూ, వచ్చే ఐదేళ్లలో లక్షలాది మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు నిర్వహించే అవకాశాలు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు వంటి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం వారికి కొత్త అవకాశాలను కల్పిస్తోంది. అలాగే వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళల వ్యాపారాలను ప్రోత్సహిస్తోంది. మహిళల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే ప్రభుత్వం ‘అమ్మ ఆరోగ్యం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా 18 ఏళ్లు దాటిన మహిళలకు ఉచితంగా అనేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తున్నారు. క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. విద్య, ఇతర రంగాల్లో కూడా మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతోంది. మహిళలు బలంగా ఉన్నప్పుడు కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉన్నప్పుడు సమాజం బలంగా ఉంటుంది. ఈ నమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. సోనియా గాంధీ ఇచ్చిన హామీ మేరకు మహిళల సంక్షేమం కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News