గోదావరిలో కొట్టుకుపోయిన ప్రేమ జంట
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లాలో పెళ్లి(Marriage)కి వారం రోజుల ముందు తీరని విషాదం (Tragedy) చోటుచేసుకుంది. పెద్దల అంగీకారంతో నవంబర్ 1న ఒక్కటి కావాల్సిన ఆ ప్రేమ జంట(Love Couple)కు ఆదివారం దైవ దర్శనమే చివరిదైంది. గోదావరిఖనిలోని సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamm) పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాల కోసం కుటుంబీకులతో కలిసి నదిలోకి దిగిన ఆ ప్రేమికులు గోదావరి (Godavari) ప్రవాహం పెరగడంతో అనుకోకుండా అందులో కొట్టుకుపోయారు.
ఆకస్మికంగా జరిగిన ఈ ప్రమాదం(Accident)తో ఒక్కసారిగా ఘాట్ వద్ద విషాద వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన స్థానిక జాలరులు వేగంగా స్పందించి గల్లంతైన యువకుడిని సురక్షితంగా కాపాడగలిగారు. అయితే దురదృష్టవశాత్తు యువతి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. జాలర్లు ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. నవంబర్ 1న పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో అపశ్రుతితో అంతులేని రోదన మిగిలింది. ఈ విషాదకర సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
