Tuesday, October 28, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఇక శుభం కార్డే

సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఇక శుభం కార్డే

  • డబ్బులుంటేనే పథకాలు అమలని బాబు సూక్తులు
  • చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్‌

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS SHARMILA) అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఇచ్చిన ప్రజెంటేషన్‌ ఇందుకు నిదర్శనమని అన్నారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ ప్లాఫ్‌ అని ఎద్దేవా చేశారు. నీతి ఆయోగ్‌ రిపోర్ట్‌ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని చంద్రబాబుపై షర్మిల మండిపడ్డారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలంటున్నారని.. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు అని విమర్శించారు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని ఆరోపించారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారని.. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని.. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని.. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, గత వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని చంద్రబాబు చెప్పారని షర్మిల గుర్తుచేశారు. జగన్‌ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరమని నిలదీశారు. ‘సూపర్‌ సిక్స్‌’ పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారమని ప్రశ్నించారు. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే అని గుర్తుచేశారు. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నది మీరేనని.. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని.. పథకాల అమలుపై దృష్టి పెట్టాలని ఏపీ కాంగ్రెస్‌ తరఫున షర్మిల డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News