హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరోసారి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటి సారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుకు ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో ఎలి లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది.
ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఎలి లిల్లీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

