Friday, February 27, 2026
HomeతెలంగాణJustice | వినియోగదారులకు మరింత సులభ న్యాయం..

Justice | వినియోగదారులకు మరింత సులభ న్యాయం..

  • ఆ దిశగా పరాతిపాదించిన సీసీఐ తెలంగాణ..
  • సానుకూలంగా స్పందించిన జస్టిస్ జి. రాధారాణి..

కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ జి. రాధారాణిని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించింది.

వినియోగదారుల సంక్షేమం, రక్షణకు సంబంధించిన కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ, “ఈ–జాగృతి” పోర్టల్ వినియోగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, ఫిర్యాదుల పరిష్కారాలు వంటి అంశాలను సీసీఐ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు.

- Advertisement -

ప్రతి జిల్లాలో వినియోగదారుల సహాయ కేంద్రాలను బలోపేతం చేయాలని, కమిషన్ మార్గదర్శకత్వంలో కన్స్యూమర్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, ఈ–జాగృతి యాప్‌పై ప్రజలకు అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న చైతన్య కార్యక్రమాలకు సంస్థాగత సహకారం అందించాలని కూడా కోరారు.

ఈ సందర్భంగా జస్టిస్ జి. రాధారాణి, సీసీఐ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ, వినియోగదారులకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే ఆలోచన కమిషన్‌దీ ఇదే దిశలో ఉందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు త్వరలో చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలు చేరువ కావాల్సిన అవసరాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ సమావేశంలో సీసీఐ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమ్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, జాతీయ ప్రధాన కార్యదర్శి పల్లెపాడు దామోదర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. సుప్రభ, రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డిలు పాల్గొని తమ సూచనలు సమర్పించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, మోసపూరిత వ్యాపార విధానాల నియంత్రణ, న్యాయసేవల సరళీకరణే లక్ష్యంగా సీసీఐ తెలంగాణ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. కమిషన్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News