దసరా హిందువులు జరుపుకునే ఒక ప్రధానమైన పండుగ. ఇది అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, అలాగే పదవ రోజున విజయదశమిగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. దసరా పండుగను ప్రతీ సంవత్సరం ఈ అశ్వయుజ శుద్ధ దశమి రోజునే జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. జగజ్జనని అయిన దుర్గాదేవి తొమ్మిది రోజులు యుద్ధం తర్వాత పదవ రోజున విజయదశమి నాడు మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది, అలాగే శ్రీరాముడు రావణాసుడిని వధించింది కూడా విజయదశమి రోజునే అలాగే శమీ వృక్షం పై ఉన్న అస్త్రాలను అర్జునుడు పూజించి ఉత్తరగోగ్రహణంలో కౌరవులపై గెలిచింది కూడా ఈ రోజునే అందుకే విజయదశమికి అంతటి విశిష్టత.
మహిషాసురుడి వధ:
మహిషాసురుడు ధైత్య వంశానికి చెందిన రంభాసురుడు అనే రాక్షసుని కుమారుడు. ధైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తనకి మరణం లేని జీవనం కావాలని మేరు పర్వత శిఖరంపై బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సును చేస్తాడు. ఇలా వేల సంవత్సరాలు ఘోరతపస్సు చేయడంతో మహిషాసురుడి అచంచలమైన తపస్సుకు బ్రహ్మదేవుడు పరవశించి ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు మహిషాసురుడితో నీ తపస్సుకు మెచ్చాను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు, అప్పుడు మహిషాసురుడు ‘బ్రహ్మదేవా నేను అమరుణ్ణి కావాలి’ అని కోరుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రాణి పుట్టక తప్పదు’. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. కావున ప్రకృతికి విరుద్ధమైన నీ కోరికను తీర్చడం అసంభవం కనుక వేరే ఏదైనా వరమును కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు అల్పమైన కోరికలకు నేను ఆశపడను, ఆడది నా దృష్టిలో అబల కావున ఆమె వల్ల నాకు ఏ ప్రమాదము జరగదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా అనుగ్రహించు అని కోరాడు, బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించాడు. బ్రహ్మ దేవుని వరప్రభావం వలన మహిషాసురుడు అధిక గర్వంతో భయమనేదే లేకుండా దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. ప్రజలను దేవతలను హింసిస్తూ చాలా కష్టాలను పెట్టాడు. అప్పుడు దేవతలంతా కలిసి త్రిమూర్తులతో మొరపెట్టుకున్నారు, త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. ఆ స్త్రీ శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము భాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళ మూర్తిగా అవతరించింది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలములు, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణుడు పాషమును, హిమావంతుడు సింహమును వాహనంగా ఇస్తారు. ఇలా సకల దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుడితో భీకరమైన యుద్ధాన్ని చేస్తుంది. తొమ్మిది రోజుల యుద్ధం తరువాత పదవ రోజున అంటే దశమి రోజున మహిషాసురుడిని సంహరిస్తుంది. ఇలా చంపిన ఈ శుభ సందర్భాన్ని మనం దసరాగా జరుపుకుంటున్నాము. దీనినే విజయానికి గుర్తుగా విజయదశమి అని పిలుస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించినందుకు గాను మహిషాసురమర్దినిగా పూజిస్తారు. దుర్గామాత పోరాడిన ఆ తొమ్మిది రోజులనే దేవీ నవరాత్రులుగా, పదవరోజు విజయదశమిగా జరుపుకుంటారు.
తొమ్మిది రోజులు – దుర్గామాత యొక్క 9 అవతారాలు
- అశ్వయుజ శుద్ధ పాడ్యమి – శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి
- అశ్వయుజ శుద్ధ విదియ- శ్రీ గాయత్రీ దేవి
- అశ్వయుజ శుద్ధ తదియ – శ్రీ అన్నపూర్ణ దేవి
- అశ్వయుజ శుద్ధ చవితి- శ్రీ మహాలక్ష్మి దేవి
- అశ్వయుజ శుద్ధ పంచమి – శ్రీ మహా చండీ దేవి
- అశ్వయుజ శుద్ధ షష్టి – శ్రీ సరస్వతి దేవి
- అశ్వయుజ శుద్ధ సప్తమి – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- అశ్వయుజ శుద్ధ అష్టమి- శ్రీ దుర్గా దేవి
- అశ్వయుజ శుద్ధ నవమి- శ్రీ మహిషాసుర మర్దిని
- అశ్వయుజ శుద్ధ విజయదశమి- శ్రీ రాజరాజేశ్వరి దేవి
విజయదశమి రోజున రావణాసురుడిని ఎందుకు దహనం చేస్తారు?
ఈ విజయదశమి రోజునే శ్రీరాముడు దుర్గాదేవిని ధ్యానించి రావణాసురుడిని వధిస్తాడు, అప్పటినుండి ఈరోజున రావణాసుడు దిష్టిబొమ్మను తగలబెట్టె సాంప్రదాయం ఏర్పడింది. ఈ రావణ దహనం వెనుక ఉన్న మరొక పరమార్ధం ఏమిటంటే నేటి సమాజంలో రోజురోజుకీ స్త్రీలపై హత్యాచారాలు పెరుగుతున్నాయి పర స్త్రీని తల్లిలా పూజించాలి లేనిచో రావణాసురుడిలానే పాపాలు పండి ఏదో ఒక రోజు దహించుకుపోతారని తెలుస్తుంది. కావున మనిషిలోని కామ క్రోధ మదమాత్సర్యాలను నశింప చేసుకోవాలని దసరా రోజు చేసే రావణ దహనం మనకు సందేశాన్ని ఇస్తుంది.
దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు, జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు?
త్రేతా యుగంలో శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి వెళ్లే ముందు పాలపిట్ట కనిపిస్తుందట అలా ఆ రోజున శ్రీరాముడు రావణ వధ చేసి విజయం సాధిస్తాడు. అందుకని శ్రీరాముడు పాలపిట్టను శుభ సూచికంగా భావిస్తారు. అందుకని ఆ రోజు నుండి ఏ పనికి వెళ్లే ముందు అయినా పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని నమ్మకంతో దసరా రోజున పాలపిట్టను చూస్తారు.
ఇక అలాగే అజ్ఞాతవాసానికి ముందు పాండవులు జమ్మిచెట్టు పై దాచిన ఆయుధాలను ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపలా కాసిందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా చాలామంది పాలపిట్టను శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే విజయదశమినాడు ఈ పక్షిని చూస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ఆ రోజున ప్రజలంతా జమ్మి చెట్టు వద్ద శమీ పూజ చేసిన తర్వాత పాలపిట్టను చూసి, జమ్మిని బంగారంగా భావించి పెద్దవారికి పెట్టి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. జమ్మి చెట్టునే పూజించడానికి గల మరొక కారణం ఏమిటంటే ఈ చెట్టులో చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి అవి చాలా రకాలైన రోగాలకు నివారణగా పనిచేస్తాయి. అందుకే జమ్మి చెట్టుకి అంతటి ప్రత్యేకం. ఈ దసరా రోజున వాహనదారులు ఇతర అనేక రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను శుభ్రపరిచి వాటికి పూజలు చేయడం కూడా అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇంకొన్ని ప్రాంతాలలోని ప్రజలు బొమ్మల కొలువుని పెట్టి పూజలు కూడా చేస్తారు. ఇలా విజయదశమి దేశంలోని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటారు. “ఒక స్త్రీ తల్లిలా లాలించగలదు. తప్పు చేస్తే దుర్గామాతగా దండించగలదు అని చాటి చెప్పే పండుగే ఈ దసరా పండుగ”.
By- ఆత్మకూరి లహరి