ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డ్రగ్స్ ఫ్రీ జోన్
వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడి
మాదకద్రవ్యాల వాడకం, వాటి దుర్వినియోగం యువత జీవితాలను నాశనం (Life Spoil) చేస్తుందని ఈగిల్ ఫోర్స్ (Eagle Force) డైరెక్టర్ సందీప్ శాండిల్య (Sandeep Sandilya) అన్నారు. వాటి వాడకానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ అనే అంశంపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Ambedkar Open University)లో మంగళవారం జరిగిన అవగాహన కార్యక్రమం(Awareness programme)లో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. విద్యార్ధులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన ఉండాలని, ఒకసారి వాటికి అలవాటుపడితే వ్యసనంగా మారి బానిసలుగా తయారవుతారని హెచ్చరించారు.
‘పిల్లలు డ్రగ్స్ వాడటం వల్ల అటు తల్లిదండ్రులకు, ఇటు సమాజానికి చెడ్డపేరు వస్తుంది. తెలంగాణ నుంచి డ్రగ్స్‌ను నివారించడం సమిష్టి బాధ్యతగా యువత భావించాలి. మాదకద్రవ్యాల వాడకం లేదా దుర్వినియోగం వల్ల వ్యక్తి సహజ లక్షణాలను కోల్పోయి నిత్యం మత్తు పదార్థాల కోసమే పరితపిస్తాడు. జీవితకాలం క్షీణిస్తుంది’ అని సందీప్ శాండిల్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హాజరయ్యారు. చక్రపాణి మాట్లాడుతూ.. యువత బంగారం లాంటి భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని, వ్యసనాలకు అలవాటుపడొద్దని హితవు పలికారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డ్రగ్స్ ఫ్రీ జోన్ అని ప్రకటించారు. రానున్న రోజుల్లో ఈ యూనివర్సిటీ విద్యార్ధులకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పారు. విద్యార్థుల సహకారంతో మాదక ద్రవ్యాల నివారణకు అవసరమైన ప్రచారాన్ని చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి, సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భట్టు, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
