డ్రెస్ కోడ్ కూడా తప్పనిసరి చేయాలి
అధికారులను కోరుతున్న స్థానికులు, భక్తులు
యాదగిరిగుట్ట, డిసెంబర్ 17 (ఆదాబ్ హైదరాబాద్): యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం(Sri Lakshminarasimha Swami Temple)లో పనిచేసే సిబ్బంది(Staff)కి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ (Dress Code), ఐడెంటిటీ కార్డు (Identity Card) ఉండేలా చూడాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. చిన్న చిన్న ఆలయాల్లోనూ యూనిఫామ్(Uniform), గుర్తింపు కార్డు కంపల్సరీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి ఆలయం(Famous Temple in Telangana)లో మాత్రం డ్రెస్ కోడ్, ఐడెంటిటీ కార్డులు ఇవ్వకపోవటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్న సమయంలో ఎవరు దేవస్థానం సిబ్బందో.. ఎవరు భక్తులో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఫలితంగా.. గుట్టపై గందరగోళంగా ఉందని స్థానికులు, భక్తులు అంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి (దేవస్థానం సిబ్బంది కాదు) సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నానని చెప్పి భక్తుల దగ్గర డబ్బు వసూలుచేశాడు. శని, ఆదివారాల్లో భక్తులు తండోపతండాలుగా స్వామి వారి దర్శనానికి వెళుతున్న సమయంలో దేవస్థానం సిబ్బందికి, భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దేవస్థానం సిబ్బంది అయితే ఐడెంటిటీ కార్డు ఏది అని భక్తులు అడిగారు. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
దేవస్థానం సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ డ్రెస్ కోడ్, ఐడెంటిటీ కార్డు, ఆ ఉద్యోగి రెగ్యులరా? ఔట్ సోర్సింగా? అనేది కార్డులో స్పష్టంగా పేర్కొనాలని సూచిస్తున్నారు. డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేయటం వల్ల దేవస్థానం సిబ్బంది చూడటానికి హుందాగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
