ప్రపంచ క్రీడా వేదికపై ఇండియా(India) సాధిస్తున్న పురోగతి(Progress)కి సమాంతరంగా ఒక చేదు వాస్తవం(Bitter Reality) దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం (International Statistics).. డోపింగ్ కేసుల సంఖ్య(Number Of Doping Cases)లో మనం ప్రపంచంలోనే అగ్ర స్థానం(Top In World)లో నిలవడం దేశ ప్రతిష్ఠకు గట్టి దెబ్బ. ఇది కేవలం కొంత మంది ఆటగాళ్ల తప్పిదంగా చూడాల్సిన అంశం కాదు. మొత్తం క్రీడా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన వైఫల్యానికి అద్దం పడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2036 ఒలింపిక్స్(Olympics) నిర్వహణకు ఇండియా చేస్తున్న మహత్తర ప్రయత్నాలు కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతాయి.
డోపింగ్ అనేది వ్యక్తిగత లాభం కోసం చేసే మోసం మాత్రమే కాదు. అది న్యాయమైన పోటీని ఖండిస్తుంది. నిజాయితీగా శ్రమించే క్రీడాకారుల కలలను చిదిమేస్తుంది. మరింత ప్రమాదకరంగా, యువ క్రీడాకారులకు ‘విజయం కోసం ఏదైనా సరే’ అనే ప్రమాదకర సందేశాన్ని ఇస్తుంది. ఇండియాలో డోపింగ్ విస్తృతంగా ఉండటానికి కారణాలు అనేకం. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, అనుభవం లేని కోచ్‌ల మార్గదర్శకత్వం, పోషకాహారానికి, నిషేధిత పదార్థాలకు మధ్య తేడా తెలియకపోవడం, వేగంగా ఫలితాలు సాధించాలన్న ఒత్తిడి.. ఇవన్నీ కలిసే ఈ దుర్గతికి దారితీశాయి.
ముఖ్యంగా బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు తమ పాత్రను పూర్తిగా నిర్వహించలేకపోతున్నాయన్నది కఠిన సత్యం. క్రీడా సమాఖ్యలు, శిక్షణా కేంద్రాలు, కోచ్‌లు, వైద్య నిపుణులు.. అందరూ కలిసే ఒక శుభ్రమైన క్రీడా సంస్కృతిని నిర్మించాలి. కానీ.. వాస్తవంలో నియంత్రణలు సడలిపోవడం, పరీక్షలపై నిర్లక్ష్యం, శిక్షల అమలులో అసమానతలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఇండియా ‘డోపింగ్ రాజధాని’గా ముద్రపడే ప్రమాదం ఏర్పడింది.
2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ ఆసక్తి వ్యక్తం చేయడం దేశానికి గర్వకారణమే. కానీ.. ఆతిథ్య దేశంగా మారాలంటే మౌలిక సదుపాయాలు, ఆర్థిక సామర్థ్యంతోపాటు నైతిక విశ్వసనీయత కూడా అత్యంత కీలకం. డోపింగ్ సమస్యను నియంత్రించలేని దేశం.. ప్రపంచ క్రీడల అత్యున్నత వేడుకను న్యాయంగా నిర్వహించగలదా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అంతర్జాతీయ క్రీడా సంఘాలు కేవలం స్టేడియాలు, వసతులు మాత్రమే కాదు.. క్రీడా విలువలు, పారదర్శకత, క్రమశిక్షణను కూడా పరిశీలిస్తాయి.
ఇప్పటికైనా ఇండియా కఠినమైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. డోపింగ్ నిరోధక చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి. ప్రతి స్థాయి క్రీడాకారుడికి నిషేధిత పదార్థాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలి. కోచ్‌లకు, ట్రైనర్లకు తప్పనిసరి శిక్షణ ఇవ్వాలి. విజయం కంటే ఆరోగ్యం, దీర్ఘకాలిక క్రీడా జీవితం ముఖ్యమన్న సందేశాన్ని చిన్న వయసు నుంచే నాటాలి. శిక్షలు భయపెట్టడానికే కాదు.. వ్యవస్థను శుభ్రపరచడానికీ ఉపయోగపడాలి.
క్రీడలు దేశానికి పతకాలను మాత్రమే కాదు.. విలువలను కూడా ఇస్తాయి. న్యాయం, క్రమశిక్షణ, నిజాయితీ.. ఇవే క్రీడల అసలైన స్పూర్తి. దాన్ని కాపాడుకోలేకపోతే ఎంతటి పతకాలు, ఎంతటి ఒలింపిక్స్ కలలు ఉన్నా అవి ఖాళీ ప్రదర్శనలుగానే మిగిలిపోతాయి. ప్రపంచానికి నాయకత్వం వహించాలనుకునే ఇండియా.. ముందుగా తన క్రీడా వ్యవస్థను శుభ్రపరచుకోవాలి. డోపింగ్‌పై యుద్ధంలో గెలవకపోతే.. 2036 ఒలింపిక్స్ కల కూడా కేవలం కలగానే మిగిలే ప్రమాదం ఉంది.
- సి.హెచ్.సాయిప్రతాప్
