తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి (TTD) బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామి, శ్రీ-భూ అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు.

స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి(Harati), ప్రత్యేక హారతులను నివేదించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.
