- అబద్ధం చెప్పిన హెడ్ మాస్టర్ కు హెచ్చరిక
కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలోని రాజీవ్ రహదారి వెంబడి ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భోజన ఏర్పాట్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటి పూట బడి అమలులో భాగంగా ఉదయం 7.30 గంటలకు విద్యార్థులు ఏమీ తినకుండా పాఠశాలకు వస్తున్నారని తెలుసుకున్న కలెక్టర్, 10.30 గంటలకు భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. దీనికి హెడ్ మాస్టర్ అన్నం, కూర, సాంబారు అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం 10వ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్, రేపటి హిందీ పరీక్ష దృష్ట్యా పాఠాలను క్లుప్తంగా చదివి అర్థం చేసుకుని రాయాలని సూచించారు. మిగతా పరీక్షలు కూడా సమర్థంగా రాయాలని, ఈ సమయాన్ని వృథా చేయకుండా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
తర్వాత 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులను “ఉదయం ఏమి తిన్నారు?” అని ప్రశ్నించగా, వారు సాంబారు అన్నం మాత్రమే తిన్నామని తెలిపారు. వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. విద్యార్థులకు ఒక లక్ష్యం పెట్టుకుని కష్టపడి చదవాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థుల సమాధానాలతో హెడ్ మాస్టర్ చెప్పిన వివరాలు భిన్నంగా ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనంలో కేవలం అన్నం, సాంబారు మాత్రమే పెట్టి కూర కూడా అందిస్తున్నామని చెప్పడం పై మండిపడ్డారు.
“భోజనం విషయంలో అబద్ధం చెప్పడం సహించేది లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
