అవసరాల రామకృష్ణారావు (Avasaral Ramakrishna Rao) ప్రముఖ సాహితీవేత్త(Literary scholar), నవలా రచయిత(Novelist). తెలుగు సాహిత్యం బతికి బట్టకట్టినంతకాలం గుర్తుంచుకునే కథా భీష్ముడు. ఆయన 1931 డిసెంబర్ 21న చెన్నైలో జన్మించారు. బాల సాహిత్యంలో అజరామరంగా నిలిచిన చందమామ(Chandamama)తో ఆయనకు గల బంధం, అనుబంధం విడదీయరానిది.
ఏడు పదుల ఏళ్ల కిందట తన 15 సంవత్సరాల తొలి సంధ్యలో చందమామ 1947 జూలై సంచికలో ‘పొట్టిపిచిక కథ’తో ప్రారంభించింది మొదలు మలి సంధ్యలో 80 ఏళ్ల వయసు వరకు రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన విశిష్ట కథా రచయిత. పొట్టి పిచిక కథ ప్రారంభ, ముగింపులు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
‘పొట్టి పిచిక కథ’ రచనే తన విజయసూత్రం అవుతుందని ఆనాడు, ఏనాడూ అనుకోలేదని చెప్పేవారు. పదిహేనేళ్ల ప్రాయంలో రాసిన, ఈ కథ ఇచ్చే సందేశం నిజంగా అద్భుతం. వెయ్యికి పైగా రచనలు చేసి, తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగి సుదీర్ఘ సాహితీ వ్యాసంగంలో పక్షులతో, జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని అలవోకగా కథా వస్తువులుగా చేసుకోవడానికి చందమామ పత్రికే భూమిక అని చెప్పేవారు. చందమామ కథ ఇచ్చిన ఊపుతో తాను రాసిన సుప్రసిద్ధ పిల్లల రచనల్లో ‘కేటూ డూప్లికేటూ,’ ‘మేథ మేట్రిక్స్,’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ,’ ‘ఆంగ్రేజీ యమ ఈజీ వంటి అరడజను రచనలు భాగమని కూడా ఆయన ఘనంగా చెప్పుకున్నారు. తెలుగులో నవలలు, కథలు వెయ్యికి పైగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చు కున్నారు. ఆయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించారు. ఒడిశాలో ఇంగ్లిష్ రీడర్(English Reader)గా పనిచేశారు. విశాఖపట్నంలో ఇంగ్లిష్ లెక్చరర్(English Lecturer)గా పనిచేశారు. వృత్తి జీవితమంతా ఆంగ్ల భాష బోధించినా, తెలుగు భాష పై ఉన్న వ్యామోహంతోనే దశాబ్దాల కాలంలో వెయ్యికి పైగా రచనలు మాతృ భాష(Mother Tongue)లోనే చేశారు. ఆధునిక సమాజం తెస్తున్న మార్పుల్లో కొన్నింటికి దూరంగానే ఉన్నానని అంగీకరించారు.
మనం మనుష్యులం, సహ జీవన సౌభాగ్యం, ఇంకానా అంతరాలు? అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ, సంపెంగలూ, సన్నజాజులూ, మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?, అది ప్రశ్న, ఇది జవాబు, హెడ్మిస్ట్రెస్ హేమలత, పేక ముక్కలు, కథా వాహిని, గణిత విశారద, కేటూ డూప్లికేటూ, అర్ధమున్న కథలు, రామ చిలుక, మోహన రాగం, మేథమేట్రిక్స్ 1, మేథ మేట్రిక్స్2, మేథ మేట్రిక్స్3, అంగ్రేజీ మేడీజీ తదితర రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ (AndhraPradesh Sahitya Academy) పురస్కారం (1969), తెలుగు విశ్వవిద్యాలయం(Telugu University) హాస్య రచయిత పురస్కారం (1994), జ్యేష్ఠ లిటరరీ అవార్డు (1998), కొలసాని చక్రపాణి అవార్డు (1999), ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు వైభవం పురస్కారం (2004) తదితర అవార్డులు ఆయనకు లభించాయి. అవసరాల 2011 అక్టోబర్ 28న హైదరాబాదు(Hederabad)లో తుది శ్వాస విడిచి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
(అక్టోబర్ 28: అవసరాల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
