హైదరాబాద్: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) పనితీరును రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి .శివధర్ రెడ్డి శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు. సిఐడి అడిషనల్ డిజిపి చారుసిన్హా, డిఐజి నారాయణ నాయక్, సిఐడి విభాగపు ఎస్పీలు, సంబంధిత అధికారులు డిజిపి సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. సిఐడి విభాగంలో ఉన్న ఎస్సిఆర్బి, పిసిఆర్, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, సీసీటీఎన్ఎస్, విమెన్ సేఫ్టీవింగ్ ల పనితీరును సమీక్షించడం(Review)తోపాటు గత ఐదు సంవత్సరాల నేరాల వివరాలను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న నేరాలు(Crimes), స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరుగుతున్న నేరాలను, వాటికి గల కారణాలను విశ్లేషించాలని డిజిపి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఎక్కువగా జరుగుతున్న నేరాలను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలపై సిఐడి దృష్టిసారించి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిజిపి సూచించారు. రానున్న సంవత్సరంలో సిఐడి దృష్టి పెట్టె నేరాన్ని ఆ సంవత్సరపు ప్రధాన లక్ష్యంగా పరిగణించాలని, దానిని నియంత్రించడంతో పాటు ఇతర నేరాలను అరికట్టాలన్నారు. వివిధ విభాగాల అధికారులు నేరాలను విశ్లేషించి సమర్థంగా పనిచేస్తే కిందిస్థాయి సిబ్బంది కూడా మరింత నైపుణ్యంగా పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేరాలను రికార్డు చేసే సందర్భంలో వాటిని క్షుణ్ణంగా విశ్లేషించాలని, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దాడులు, మోసాలు, వంటి నేరాలలో అవి ఏ రకమైనవో రికార్డు చేయడం ద్వారా నియంత్రించే మార్గాలను అన్వేషించవచ్చన్నారు. దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్(Gang)ల వివరాలను సేకరించాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ల తప్పిదం ఏమైనా ఉంటే కారణాలు తెలుసుకోవాలని, పోలీసు డ్రైవర్ల విషయంలో కంటి చూపు కారణంగా ప్రమాదాలు జరిగితే వారికి కంటి పరీక్షలు చేసే విధంగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని డిజిపి సూచించారు. సిఐడి ఎస్పీలు విశ్వజిత్ కంపాటి, సంగ్రామ్ సింగ్ జి.పాటిల్, మద్దిపాటి శ్రీనివాస్, వెంకటలక్ష్మి, రామిరెడ్డి,శ్రీనివాస్ తదితరులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
