Tuesday, March 3, 2026
Homeఖమ్మంBhatti | సైట్ విజిట్ నిబంధన కొత్త కాదు

Bhatti | సైట్ విజిట్ నిబంధన కొత్త కాదు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ఆత్మగా నిలిచిన సింగరేణి(Singareni) సంస్థపై పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ(AndhraJyothy Radha Krishna) చేస్తున్న తొలి పలుకు కథనాలు సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క(Deputy CM Mallu Bhattivikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు అని ఎద్దేవా చేశారు.

- Advertisement -

‘రాధాకృష్ణ తొలి పలుకుల నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి?. ఏ రాబందుల, ఏ గద్దల, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు?. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమం, సమర్థవంతమైన పాలన, సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావులేదు. సింగరేణిలో టెండర్లు లేదా వాటికి సంబంధించిన ఫైళ్లు నా వద్దకు గానీ రాష్ట్ర ప్రభుత్వానికి గానీ రావు.

సింగరేణి ఒక స్వయంప్రతిపత్తి(Autonomous) సంస్థ. బోర్డు, సీనియర్ అధికారులు సంస్థలో అమల్లో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే పూర్తిగా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదు. నైనీ బొగ్గు బ్లాకు టెండర్ విషయంలో సైట్ విజిట్(Site Visit) సర్టిఫికెట్ నిబంధన కొత్తది కాదు. ఇది గతంలోనే అమల్లో ఉంది. 2018, 2021, 2023లో సీఎంపీడీఐఎల్ రూపొందించిన టెండర్ డాక్యుమెంట్లలోనూ, కోలిండియా, ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థలు తదితర సంస్థల్లో కూడా ఈ విధానం ఎన్నేళ్లుగా అమల్లో ఉంది.

సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం. 4 కోట్ల ప్రజల ఆస్తి విషయంలో ఆరోపణలు వచ్చిన వెంటనే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా టెండర్లను నిలిపివేయాలని ఆదేశించాను. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు, దేశానికి తెలియాలి. కొద్ది మంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తులపై సాగిస్తున్న అడ్డగోలు ప్రచారం బయటపడాలి. అందుకే.. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను, పత్రాలను ప్రజల ముందుకు విడుదల చేస్తున్నాను’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News