జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాల సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని నారాయణ సూచించారు. కేరళ వెళ్లి అభివృద్ధిపై విమర్శలు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో విద్యకు దూరంగా ఉన్న విద్యార్థుల సమస్యలపై స్పందించాలని కోరారు.
కార్పొరేట్ పాఠశాల ప్రారంభాలకు హాజరవుతున్న ప్రభుత్వం, గబ్బిలాలపేటలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ఎప్పుడు పునాది వేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి నివాసానికి పాదయాత్ర చేపడతామని నారాయణ హెచ్చరించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతి వ్యక్తి ఒక బుట్ట చెత్త తీసుకుని మున్సిపల్ ఆఫీసు వద్ద వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ విద్యాకమిషన్ సలహాదారు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్య అందకపోతే భావి భారతం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

విద్యా పరిరక్షణ కమిటీ నాయకుడు ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ లక్ష మందికి పైగా విద్యార్థులు ఉన్న జవహర్ నగర్లో కేవలం రెండు హైస్కూల్లు మాత్రమే ఉండటం అన్యాయం అన్నారు. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారని, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని తెలిపారు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత మాట్లాడుతూ అమ్మాయిలకు విద్య అందుబాటులో లేకపోవడంతో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కన్నెగంటి రవి మాట్లాడుతూ అభివృద్ధి చెందిందని చెప్పుకునే రాష్ట్రంలో పాఠశాల కోసం పోరాటం చేయాల్సి రావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ఎస్ బోస్, జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి, శంకర్, నర్సింహులు, ఏఐఎస్ఎఫ్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్, మాజీ కార్పొరేటర్లు చిత్ర సుబ్రమణ్యం, మేకల లలిత, శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు.
