- తమ వద్ద బలమైన ఆధారాలున్నాయన్న సీబీఐ
- సీబీఐ పిటిషన్పై మార్చి 9న విచారణ జరిగే అవకాశం..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు తీర్పు పూర్తిగా చట్టవిరుద్ధమని, వితండవాదంతో కూడుకున్నదని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.
నిందితులకు వ్యతిరేకంగా తాము సమర్పించిన ఆధారాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది. అసలు విచారణ ప్రారంభం కాకముందే న్యాయాధికారి ఒక మినీ ట్రయల్ నిర్వహించి నిందితులకు క్లీన్‌చిట్ ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు చేసిన నేరాన్ని స్పష్టంగా చూపే సాక్ష్యాధారాలను కోర్టు పక్కనపెట్టిందని, న్యాయస్థానం ఉత్తర్వుల్లో ప్రాథమికంగానే అనేక లోపాలు కనిపిస్తున్నాయని, ముఖం చూస్తేనే తెలిసే తప్పుల వలే తీర్పు ఉందని సీబీఐ విమర్శించింది.
ఎక్సైజ్ కుంభకోణంలో నిందితుల పాత్రపై తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, వాటిని విస్మరించడం న్యాయ విరుద్ధమని పేర్కొంటూ దిగువ కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది. సీబీఐ పిటిషన్పై మార్చి9న విచారణ జరిగే అవకాశముంది.
