Monday, October 27, 2025
ePaper
Homeసాహిత్యంDIWALI: ధన త్రయోదశితో దీపారాధనకు శ్రీకారం

DIWALI: ధన త్రయోదశితో దీపారాధనకు శ్రీకారం

దీపావళి పండగ సందర్భంగా వరుసగా ఐదు రోజులు పర్వదినాలుగా భావించ బడుతున్న క్రమంలో మొదటిదైన ధన త్రయోదశి ప్రాముఖ్యతను సంత రించుకున్నది.  ఆది వైద్యుడైన ధన్వంతరి జయంతి కావడం చేత ధన్వంతరి త్రయోదశిగా భావిస్తారు. అందుకే వైద్యులు ఘనంగా పూజిస్తారు. మహావిష్ణువు వామనావతారం ధరించి, బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిందీ ఈరోజేనని ప్రతీతి. అందుకే ‘త్రివిక్రమ త్రయోదశి’గా పిలవడమూ పరిపాటి.  ఈ రోజుకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ‘అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అకాల మత్యుభయాలు లేకుండా, సిరి సంపదలతో విలసిల్లాలి’ అనే శుభాకాంక్షలకు నేపథ్యమే ధనత్రయోదశి పర్వదినం. సంపదలతో తుల తూగడానికి లక్ష్మీదేవినీ, సంపూర్ణ ఆరోగ్యంకోసం ధన్వంతరినీ, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్నీ, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ధన త్రయోదశినాడు పూజించడం సాంప్రదాయం.

గుజరాతీయులకు సంవత్స రాది. అమావేర్ జ్యోతిషీ త్రయోదశిగా పేర్కొంది. అనగా పదమూడవ తిథి, పాశ్చాత్యులు పదమూడవ సంఖ్య మంచిది కాదని భావిస్తుండగా, హిందువులు మాత్రం మంచి రోజుగా తలుస్తారు. ధన త్రయోదశిని గుజరాతీయులు “ధన్ తేరస్” అని పిలుస్తారు. పొరుగు వారైన మహారాష్ట్రులు ధన త్రయోదశిని గొప్పగా జరుపు కుంటారు. ఆంధ్రావనిలోనూ పవిత్రమైన దినంగా ఆచరిస్తారు. ఈరోజు తమ ఇళ్ళను శుభ్ర పరుస్తారు. అలికి, కడిగి, ఇళ్ళముందు రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతారు. శుచిగా, శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి తమ ఇంటికి రాగలదని విశ్వాసం. ఈనాటి నుండి దీపాలను వెలిగించడం ప్రారంభం అవుతుంది. ఈనాడు అభ్యంగన స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని, సుగంధ ద్రవ్యాలు రాసుకుని, ధన పూజ చేస్తారు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి వస్తువులను పాలతో కడుగుతారు. శుభ్రంగా పూజా స్థలంలో ఉంచుతారు. షావుకార్లు వ్యాపారులు ఈదినం తమ సరుకుల నిలువ, రొక్కం నిలువ సరి చూసుకుని, లక్ష్మీ పూజ చేస్తారు.

గుజరాత్, మహారాష్ట్రలలో, మాళవదేశంలో పండగ ఆచరణ అనాదిగా ఉంది. దీపావళి నుండి కొత్త ఖాతాలు, లెక్కలు ప్రారంభిస్తారు. వర్షాలు చాలా వరకు వెనకపట్టు పడుతుండడంతో, ఇక్కకు వెల్లవేసి, అలంకరణలు చేస్తారు. యమలోకం లోని పితరులు కూడా ఈ పండగకు తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల విశ్వాసం. ధన త్రయోదశి నాడు సాయంకాలం తమ ఇళ్ళ ముందు దక్షిణ దిశగా దీపాలు ఉంచుతారు. వచ్చే పితృ దేవతలకు దీపాలు దారి చూపిస్తా యని నమ్మకం. ఇంటి యజమాని, తల్లిదండ్రులు ఉంటే దక్షిణ దిక్కుగా పెట్టరు. ఈనాడు ఇంటిలో ఒక్క దీపమైనా పెడతారు. వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సహస్ర నామార్చ నలు, లక్ష్మీ సూక్త మూలమంత్ర సంపుటీకరణం శ్రీసూక్త పూజలు గావిస్తారు. ప్రత్యేక దీపాలంకరణ ఆరాధనలు నిర్వహిస్తారు.

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమ యంలో మహావిష్ణువు అంశావతారంగా అమృత కలశ హస్తుడై సమస్త జనావళికి రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించిన దినాన్ని హిందువులు ధన త్రయోదశి అని పండుగ జరుపుకుంటారు. గృహాలలో, నదీ సాగర తీరాలలో, వైద్య శాలలలో తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి, ధన్వంతరిని ఆవాహన గావించి, ధన్వంతరిని ధ్యానించాకనే యథాశక్తి షోడశోపచార సహిత పురుశసూక్త విధానంతో అర్చన జరిపి, మత్స్య పురాణాంతర శ్లోక పఠనం చేసి, గరుడ పురాణాంతర్గత ధన్వంతరి సార్ధకత కథ పాఠాయణం చేసి, వైద్యులకు, పెద్దలకు తాంబూలాలు సమర్పించి, ఘృతయుక్త  పెసర పులగం నివేదన చేసి, భుజించడం ఆచారం. అలాగే లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కారమైన రోజుగా,  దన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దీంతో ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మీ కృపాకటాక్షాలు చేకూరుతాయని విశ్వసిస్తారు…

  • రామకిష్టయ్య సంగనభట్ల

   9440595494

RELATED ARTICLES
- Advertisment -

Latest News