- ప్రియుడితో కలిసి ఘాతుకం, ఏడాది తర్వాత వెలుగులోకి వచ్చిన మిస్టరీ
సమాజం తలదించుకునే దారుణ ఘటన హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసింది. కన్నప్రేమను మరిచి కని పెంచిన తల్లిని కూతురు హతమార్చిన సంఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. ప్రియుడి మోజులో పడి అడ్డుగా ఉందనే కారణంతో తల్లిని చంపి, ఇంట్లోనే గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టిన ఘటన ఏడాది తర్వాత బయటపడింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకుర్ భరత్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, 2025 మే నెలలో అంజు (40) అనే మహిళ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఈ మేరకు జవహర్ నగర్, బొల్లారం పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు లోతైన విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంజు కూతురు తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తల్లిని ఇంట్లోనే హతమార్చి, ఎవరికీ అనుమానం రాకుండా అదే ఇంట్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

దాదాపు ఏడాది పాటు ఈ కేసు మిస్టరీగా కొనసాగింది. తాజాగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసే ప్రక్రియ చేపట్టారు. కన్నతల్లి అనే భావన కూడా లేకుండా ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కూతురి ప్రవర్తనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
