- గాంధేయ విలువలకు ఘోరమైన అవమానం జరుగుతోంది..
- తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు..
- రేవంత్ అప్రజాస్వామిక పాలనను మీరు అరికట్టాలి..
- లేకపోతే మీరు మీ పార్టీ చరిత్రలో కనుమరువైపోతారు..
- కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీకి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ..
తెలంగాణలో పాలన గల్లీకరణ దిశగా సాగుతోందని, తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా రాజ్యాంగ నైతికతకు, గాంధేయ విలువలకు జరుగుతున్న ఘోర ద్రోహంపై రాహుల్ గాంధీకి డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు బహిరంగ లేఖ రాశారు.. ఆయన లేఖలోని సారాంశం ఒకసారి చూద్దాం..
ముందుగా ఆయన రాహుల్ గాంధీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏవైతే సిద్ధాంతాలను ప్రబోధిస్తుందో, వాటిని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆచరించాలనే నమ్మకంతో, ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో నిండు వేదనతో నేను ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గాంధేయ విలువలకు రాజ్యాంగ నైతికతకు ప్రజాస్వామ్య హుందాతనానికి రక్షకురాలని మీరు నిరంతరం చెప్తుంటారు. కానీ తెలంగాణలో మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దానికి పూర్తి విరుద్ధమైన అత్యంత ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.
గల్లీ భాష పాలనగా మారింది రాజ్యాంగ నైతికతపై దాడి :
జాతీయ రాజకీయాల్లో, మీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ వారసత్వానికి నైతిక సంరక్షకురాలిగా తనను తాను నిలబెట్టుకుంటుంది. గాంధేయ విలువలను కించపరుస్తున్నారని, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి మహనీయుల వారసత్వంపై దాడులు చేస్తూ ప్రజా జీవితంలో నాగరికతను రూపుమాపుతున్నారని మీరు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై గొంతెత్తి విమర్శలు చేస్తుంటారు. కానీ తెలంగాణలో, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ చర్చను ఎంతగా దిగజార్చిందంటే అది మీరు ఢిల్లీలో విమర్శించే ఉల్లంఘనల కంటే కూడా చాలా దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అహింస సత్యాగ్రహం గురించి బోధిస్తుంటే, హైదరాబాద్ లోని దాని నాయకత్వం మాత్రం బూతులు, బెదిరింపులు, వాచక హింసను అక్కున చేర్చుకుని పాలనను ఒక బూతుల సామ్రాజ్యంగా మార్చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్కృతిని హుందాతనాన్ని, అభివృద్ధిని, మానవత్వాన్ని కూడా విస్మరించి, వాటి స్థానంలో అహంకారాన్ని, గల్లీ రౌడీల భాషను వినియోగిస్తూ, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై జుగుప్స కలిగించే బూతు భాషతో రాజకీయ దాడికి దిగుతున్నారు.

గ్రామ స్వరాజ్యమా లేక ‘మటస్ షాపు’ సిలబసా? :
కొడంగల్ లో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో జరిగిన అధికారిక సమావేశంలో ఈ దుస్ధితి స్పష్టంగా కనిపించింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులను ముఖ్యమంత్రి తన బూతు పురాణంతో భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామ స్వరాజ్యానికి రాజ్యాంగ రథసారథులైన ఈ ప్రతినిధులు, 73వ రాజ్యాంగ సవరణ, నిధుల మళ్లింపు, గ్రామ స్థాయి ప్రణాళికల గురించి మార్గదర్శనం లభిస్తుందని ఆశించి వచ్చారు. కానీ ఆ పవిత్రమైన సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి తన అసభ్యకరమైన బెదిరింపు భాషతో భ్రష్టు పట్టించారు. “తోలు తీస్తా”, “పేగులు మెడలో వేసుకుంటా”, “కాళ్లతో తొక్కి చంపేస్తా” అంటూ ముఖ్యమంత్రి వాడిన పదాలు ఒక కసాయి వాడి భాషలా ఉన్నాయే తప్ప ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిలా లేవు. సర్పంచులను గ్రామాల ప్రథమ పౌరులుగా చూడకుండా, రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకునే ఒక ప్రైవేట్ సైన్యంలా చూస్తూ ప్రజాస్వామ్య సేవా స్ఫూర్తిని భయానక సంస్కృతితో భర్తీ చేశారు..
శ్రమ గౌరవాన్ని అవమానించడం వంచన :
బీఆర్ఎస్ నాయకుడు కేటీ రామారావు అమెరికాలోని వృత్తిని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి దానిని “బాత్రూమ్ లు కడగడం, ప్లేట్లు శుభ్రం చేయడం” అని హేళన చేశారు. ఏ ఆధునిక ప్రజాస్వామ్యంలోనైనా స్వయం సమృద్ధి అనేది గౌరవం, అవమానం కాదు. నిజాయితీ గల శ్రమను ఎగతాళి చేయడం రాజకీయ విమర్శ కాదు; అది సాంస్కృతిక దివాలాకోరుతనం.. గౌరవంగా కష్టపడి బతికే కోట్లాది మంది భారతీయులను అవమానించడమే. తన స్వంత ఆంధ్రప్రదేశ్ అల్లుడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నారని ఎద్దేవా చేయడం పరమ వంచన.
లగచర్ల గ్రామంలో గిరిజన భూములను ముఖ్యమంత్రి అల్లుడికి సంబంధించిన ఫార్మా ప్రయోజనాల కోసం బలవంతంగా సేకరించారని ఆ క్రమంలో అమాయక ఆదివాసీ రైతులను వేధించి జైలుకు పంపారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, సింగరేణి కార్మికుల 100 కోట్లకు పైగా కష్టార్జితాన్ని లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం మళ్లించి తద్వారా ముఖ్యమంత్రి ఆంధ్ర అల్లుడికి, కుటుంబానికి మేలు చేశారనే ఆరోపణలు, ప్రజల సొమ్ము ప్రజా సంక్షేమం కోసమా లేక కుటుంబ ప్రయోజనాల కోసమా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి..
సామాజిక విలువలకు విషం :
పిల్లల ముందే అసభ్యత:
ఇటీవల హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సంఘటన అత్యంత దారుణమైనది. పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే ముఖ్యమంత్రి మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావుపై అత్యంత అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. “బట్టలు ఊడదీసి కొడతా”, “ప్యాంటులో బల్లులు వదులుతా”, అంటూ బహిరంగంగా అవమానిస్తానని ఏ తల్లిదండ్రులూ తరగతి గదిలో సహించని భాషను వాడారు. ముఖ్యమంత్రి పిల్లల ముందే ఇలాంటి అసభ్యతను ప్రదర్శించడం ద్వారా అరాచక భాషను సమాజంలోకి పంపిస్తున్నారు..
నిరంతర నేరస్థుడు, 89 కేసులు :
రాహుల్ జీ, మీరు రాజ్యాంగం, నైతికత గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం 89 క్రిమినల్ కేసులు ఉండి కోర్టుల ద్వారా “హ్యాబిచువల్ అఫెండర్” అంటే నిరంతర నేరస్థుడుగా ముద్రపడిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించడం కాంగ్రెస్ పార్టీ నైతికతకు నిదర్శనమా? ఇలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి గల్లీ భాషను వాడుతూ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు.
బిల్డర్ వర్సెస్ బ్రోకర్ :
భాష మాత్రమే కాదు, తెలంగాణలో పాలన కూడా పూర్తిగా దిగజారింది. కేసీఆర్ హయాంలో తలసరి ఆదాయం 1.24 లక్షల నుండి 3.17 లక్షలకు పెరిగింది, జీఎస్టీపీ 4 లక్షల కోట్ల నుండి 15 లక్షల కోట్లకు చేరింది.. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా ఎదిగింది. దానికి విరుద్ధంగా, ప్రస్తుత ప్రభుత్వంలో “ఆర్.ఆర్. టాక్స్” రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊపిరాడకుండా చేస్తోంది. 1.5 లక్షల కోట్ల మూసీ ప్రాజెక్ట్ భారీ తరలింపులకు దారితీస్తూ అదానీ గ్రూప్ వంటి కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చడం మానేసి, ఈ ప్రభుత్వం అవినీతి నియంతృత్వ పోకడలు, అరాచక పాలనలో మునిగిపోయింది.
శాసనసభ హుందాతనం పతనం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బూతులు :
రాహుల్ జీ, తెలంగాణలో రాజకీయ పతనం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. ఇది ప్రజాస్వామ్య చర్చలకు, రాజ్యాంగ నైతికతకు నిలయమైన శాసనసభ అనే పవిత్ర దేవాలయంలోకి బూతుభాష ప్రవేశించింది. శాసనసభ లోపలా ముఖ్యమంత్రి హుందాతనాన్ని, కనీస మర్యాదను వదిలేసి ప్రవర్తిస్తున్నారు. ఎన్నికైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ సీనియర్ నాయకులైన కేటీఆర్ ని, టి. హరీష్ రావుని బహిరంగంగానే “బడవ” వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, లైంగిక వేధింపుల తరహాలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల సమస్యలపై ఇచ్చే సమాధానాలకు బదులుగా వారిని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. “నాలుక కోస్తా” వంటి మాటలు కేవలం అసహనమే కాదు, అవి ముఖ్యమంత్రి అనాగరిక స్వభావాన్ని, నియంతృత్వ ధోరణిని సూచిస్తున్నాయి.
ఇది శాసనసభను అవమానించడమే కాకుండా సభాపతి స్థానాన్ని కేవలం అరుపులకు, కేకలకు వేదికగా మారుస్తోంది. అసెంబ్లీలో ఇలాంటి భాషను అనుమతించడం వల్ల, అధికారం ఉంటే ఎవరినైనా కించపరచవచ్చనే ప్రమాదకరమైన సంకేతాలు వెళ్తున్నాయి. చర్చల స్థానంలో బెదిరింపులు వస్తే ఆ సభకు విలువ ఉండదు. ఒక ఫ్యాక్షనిస్టులా అసభ్య పదజాలంతో మాట్లాడే ఏ నాయకుడూ గాంధేయ వారసత్వాన్ని క్లెయిమ్ చేయలేడు. ముఖ్యమంత్రి చేసే ‘మటన్ షాపు’ మాటలు రాజ్యాంగ నైతికతతో కలిసి ఉండలేవు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా “మొహబ్బత్ కీ దుకాస్”, “జై సంవిధాస్” అని ర్యాలీలు తీస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఒక రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతి నడుపుతున్నారు.
నేరపూరిత బెదిరింపులతో కూడిన “బూతుల కబేళా” :
రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనను మీరు అరికట్టకపోతే, అరాచకానికి సహకరించిన వారిగా చరిత్ర మిమ్మల్ని కూడా దోషిగా నిలబెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రవర్తనను మార్చుకోవాలి, లేదంటే ఆయన పాలనకు అంతం పలకాలి. లేదంటే తెలంగాణ ప్రజలు త్వరలోనే ఒక బలమైన పాఠాన్ని నేర్పుతారు. అహంకారం ఎంతటిదైనా ప్రజా తీర్పు ముందు కొట్టుకుపోక తప్పదు.
రాహుల్ జీ, 2023 ఎన్నికల సమయంలో మీరు ‘మార్పు’ కోసం ప్రచారం చేసినప్పుడు ఆశించిన మార్పు ఇది ఎంతమాత్రం కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారికి, మౌనం వహించి ఆ అరాచకానికి సహకరించిన వారికి మధ్య చరిత్ర ఎటువంటి వ్యత్యాసం చూపదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వారసత్వానికి ప్రధాన రక్షకుడిగా, మీరు తక్షణమే జోక్యం చేసుకుని, తెలంగాణలో ప్రజాస్వామ్య గౌరవాన్ని పునరుద్ధరించాలని, మీరు చెప్పే మాటలకు కట్టుబడి ఉన్నారని దేశానికి నిరూపించాలని దాసోజు విజ్ఞప్తి చేశారు.. ముఖ్యమంత్రి రేవంత్ యొక్క బహిరంగ అవినీతి, రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తనను సరిదిద్దాలి, లేదా ఆయన పాలనకు అంతం పలకాలి.
అలా జరగని పక్షంలో, తెలంగాణ ప్రజలు త్వరలోనే ఒక బలమైన పాఠాన్ని నేర్పుతారు, అది రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తుంది. భారతదేశంలో ‘రీకాల్’ పద్ధతి లేకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యం ఓపిక కలిగి ఉంటుంది, అలాగని మర్చిపోదు. ప్రజలు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు, ఈ అహంకారం, రాజ్యాంగ విరుద్ధమైన నియంతృత్వ ధోరణి ఎంత శక్తివంతంగా కనిపించినా ప్రజా తీర్పు ముందు కొట్టుకుపోక తప్పదు అని ఆయన హెచ్చరించారు..
