- నిబంధనలు తుంగలో తొక్కి..
- సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన వైనం!
- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో భారీ ` భూకుంభకోణం..
- కేంద్రం అనుమతి లేకుండానే పట్టాలు ఎలా మారాయి?
- ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ ప్రత్యేక ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్
ప్రజా ప్రయోజనాల కోసం, దేశ విభజన సమయంలో వదిలివెళ్లిన ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన ‘‘కస్టోడియన్ భూములు’’ ఇప్పుడు భూబకాసురుల పాలవుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, కీసర డివిజన్, ఉప్పల్ మండలంలోని సర్వే నంబర్ 644, 645లలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల ఏడు గుంటల విలువైన ప్రభుత్వ భూమి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ భూ బదిలీ వెనుక ఉన్న ఆ ‘అదృశ్య హస్తం’ ఎవరిది? చట్ట ప్రకారం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కస్టోడియన్ ఆఫ్ ఎనివిూ ప్రాపర్టీ ఫర్ ఇండియా’ (సిఈపిఐ) అనుమతి లేకుండా ఈ భూములపై ఎవరికీ ఎటువంటి హక్కులు కల్పించే అధికారం లేదు.
1950 నాటి ఎవాక్యూ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, మరియు 1968 నాటి ఎవాక్యూ ప్రాపర్టీ యాక్ట్ ల ప్రకారం, ఈ భూములకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ‘కస్టోడియన్’ మాత్రమే సంరక్షకుడిగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, స్థానిక రెవెన్యూ అధికారులు గానీ కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా ఈ భూములను ఇతరులకు కేటాయించడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం పూర్తిగా అక్రమం.

అధికారుల అండదండలతోనో లేక రికార్డుల తారుమారుతోనో కోట్లాది రూపాయల విలువైన ఈ భూమి అన్యాక్రాంతమైంది. నిబంధనలను తుంగలో తొక్కి, సర్కారు ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన ఈ వ్యవహారంలో తెరవెనుక సూత్రధారులు ఎవరు? రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి? దీనిపై పూర్తి స్థాయి ఆధారాలతో, బాధ్యుల ముసుగులు తొలగిస్తూ ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ ప్రత్యేక కథనం ద్వారా ఈ అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తేనుంది
