- సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను వెంటనే మార్చాలని సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 2026 మార్చి 13 నుంచి ఏప్రిల్ 16 వరకు.. 35 రోజుల పాటు పరీక్షలు నిర్వహించటం అశాస్త్రీయమని పేర్కొంది. పరీక్షలను సుదీర్ఘ కాలం జరపడం వల్ల విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి, అలసట, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిపుణుల సూచనలు, సలహాలు తీసుకొని కొత్త షెడ్యూల్ విడుదల చేయాలని కోరింది.

విద్యార్థుల మానసిక స్థితిగతులపై కనీస అవగాహన లేకుండా ఒక్కో పరీక్ష మధ్య 5 రోజులు గ్యాప్ ఇవ్వటం సరికాదని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ వల్ల విద్యార్థుల భవిష్యత్పై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత షెడ్యూల్ను తక్షణం రద్దు చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విజ్ఞప్తి చేశారు.
