Friday, March 20, 2026
Homeరంగారెడ్డిCPI(ML) | ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై సిపిఐ(ఎం.ఎల్) నేత షేక్ షావలి ఆగ్రహం

CPI(ML) | ప్రజావ్యతిరేక బడ్జెట్‌పై సిపిఐ(ఎం.ఎల్) నేత షేక్ షావలి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజలను మోసగించే ప్రజావ్యతిరేక బడ్జెట్ అని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి షేక్ షావలి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం డిప్యూటీ సిఎం ద్వారా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను సంక్షేమం, అభివృద్ధి పేరిట ప్రవేశపెట్టడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు.

ఆదాయం, వ్యయం మధ్య అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సామాన్య ప్రజలకు అర్థంకాని విధంగా బడ్జెట్ రూపొందించి అన్నివర్గాలకు ఉపయోగపడేలా చూపిస్తున్నప్పటికీ వాస్తవానికి పెద్దల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. మేడారం జాతర నిర్వహణ, గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకోవడం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని అన్నారు.

- Advertisement -

ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేద, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం, మూసి ప్రక్షాళన పేరుతో వేలాది కుటుంబాలను బలవంతంగా తరలించడం వంటి చర్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాత్ర వహించిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆరు గ్యారంటీల అమలులో వెనుకబడి ఉందని అన్నారు.

అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై స్పష్టత లేని బడ్జెట్ ప్రజలకు లాభం చేకూర్చదని విమర్శించారు. రాబోయే కాలంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం పెరిగే అవకాశం ఉందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉందని షేక్ షావలి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి ప్రజావ్యతిరేక బడ్జెట్లకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News