- 42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం.. కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిన అధికార కాంగ్రెస్ పార్టీ..
- బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శ
బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడు తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్ విమర్శించారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన డిమాండ్ చేశారు. తమకు అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పై బీసీలు కత్తులు నూరుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాల్లో పూర్తి వ్యతిరేకత ఉందని.. ఇక, భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలిచే అవకాశమే లేదని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతున్నాయని చెప్పారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి జరగాలంటే భాజపాతోనే సాధ్యం. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయలేదు. కుల ధ్రువీకరణ పత్రం కోసం సర్వర్లు పని చేయక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. బీసీ రిజర్వేషన్లపై డ్రామాలాడింది.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ ఈటల తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఉండవని.. గెలిచిన వారిని కాంగ్రెస్ నుంచి గెలిచారని చెప్పుకుందామని భావి స్తున్నారేమో అంటూ సందేహం వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ చేసిన మోసానికి బీసీలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? అంటూ అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు.
బీసీల జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్లు ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ సర్కారును ఆయన సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ లో నాడు బీఆర్ఎస్ భూములు లాక్కున్నట్టే నేడు కాంగ్రెస్ పార్టీ లాక్కుట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భూ కుంభకోణాల కు హద్దు లేదు.. దీనికి మూల్యం చెల్లిం చక తప్పదంటూ ఎంపీ ఈటల హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోనే అధిక భూములు లాక్కుంటున్నారంటూ సోదాహరణగా వివరించారు. భూముల కోసమే జీహెచ్ఎంసీ పరిధి విస్తరించినట్లు అయితే.. దాని కంటే దరిద్రం ఇంకోటి లేదని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
