కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ(Congress Party MLC) అద్దంకి దయాకర్(Addanki Dayakar) అమెరికాలో పర్యటిస్తున్నారు(America Tour). ఇందులో భాగంగా గ్రేటర్ హ్యూస్టన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్(TAGH) సహకారంతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ మీటింగ్‌ను గాధే శ్రీధర్ రెడ్డి, సోమయ్య అధ్వర్యంలో ఏర్పాటుచేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఫోర్ట్ బెండ్ కౌంటీలో జడ్జి పదవులకు పోటీ చేస్తున్న కెన్నెత్ ఒమొరుయి, ఆశారెడ్డి పాల్గొన్నారు. సుమారు 70 మంది పాల్గొన్న ఈ భేటీలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
హైదరాబాద్ సమీపంలో ఏర్పాటుకానున్న ఫ్యూచర్ సిటీ(Future City In Hyderabad)లో ఎన్‌ఆర్‌ఐలకు విస్తృత పెట్టుబడి (NRIs Investment) అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వ విజన్(Telangana Government Vision)లో భాగస్వాములు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలను కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు (Telugu States) మరింత అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల నుంచి ఏవైనా అభ్యర్థనలు, డిమాండ్లు లేదా సూచనలు ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పరిష్కరించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
2026లో జరిగే ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఆశారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ప్రతినిధులు విజయ్ దేవిరెడ్డి, ప్రొఫెసర్ రాజేందర్ అప్పారసు, రాజ్ గుత్తా, వీరేందర్ దేవిరెడ్డి, నారాయణరెడ్డి ఇందుర్తి, సువీన్ మాడుగుల, రాజేశ్ గంప, వెంకట్ గార్లపాటి, ఉదయ్ మరుపాకులతోపాటు హ్యూస్టన్‌లోని స్థానిక తెలుగు సమాజ నాయకులు పాల్గొన్నారు.
