- పేట కాంగ్రెస్లో మారుతున్న లెక్కలు.. సర్వోత్తం రాజకీయ అడుగులు
- కాంగ్రెస్ పునరుజ్జీవన యత్నాలు.. గ్రూపు రాజకీయాలే సవాల్
- గ్రూపులు కలిస్తే పేట అడ్డా.. లేదంటే ప్రత్యర్థుల చేతికి ఛైర్మన్ పీఠం
- మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న వేనారెడ్డి
- గెలిచే వ్యక్తే పేటకు రెండవ ఎమ్మెల్యే..?
తెలంగాణలో దాదాపు దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించి నప్పటికీ, తెలంగాణ ముఖద్వారం అయిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం పార్టీ విజయాలు అంత సులభంగా దక్కలేదు. కేవలం స్వల్ప మెజారిటీ తోనే ఎమ్మెల్యే జగదీశ్వర్రెడ్డి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. అధికార కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, గ్రూపు రాజకీ యాలు సహజమే అయినా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో పార్టీని ఒక తాటిపై నిలబెట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. అయితే దక్షిణ తెలంగాణ ఉద్య మాల పురిటిగడ్డగా పేరొందిన సూర్యా పేటలో మాత్రం వర్గ విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. ఫలితంగా వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దివంగత నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి ఓటమిపాలయ్యారు.
ఈ పదేళ్ల కాలంలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు గల్లీ లీడర్లు సైతం అధికారానికి దూరంగా ఉండిపోయారు.
అప్పుడొక లెక్క… ఇప్పుడొక లెక్క : సర్వోత్తం రెడ్డి..
కొన్ని నెలల క్రితం దామోదర్రెడ్డి మృతి అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. దామోదర్రెడ్డి తనయుడు, ఏఐసీసీ నాయకుడు సర్వోత్తం రెడ్డి రంగప్రవేశం చేయడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త కదలికలు మొదలయ్యాయి. వేనారెడ్డి, పోతు భాస్కర్లతో కలిసి తలోదిక్కుగా ఉన్న జిల్లా కాంగ్రెస్ నాయకులను ఒక చోట చేర్చేందుకు యువనాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి ఉత్తమ్కుమారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, పార్టీ వ్యవహారాల్లో ఓటు బ్యాంకు చీలకుండా సర్వోత్తం రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పట్టణ కాంగ్రెస్ లో అనేక గ్రూపులు ఉన్నప్పటికీ, అధికారం లేకపోయినా ఈసారి పేట అడ్డాపై గెలవాలనే పట్టుదలతో పార్టీ శ్రేణులు ఉన్నారు. ప్రతి సమీక్షా సమావేశంలో గెలుపు సాధించే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
రంగుల రాజకీయాలు :
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువే. అధికారంలో ఉన్నా లేకున్నా నాయకత్వం కూడా అధికమే. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తూ పట్టిన జెండా వీడని నాయకులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక్కసారి అధి కారం వస్తే చాలు అన్న భావనతో ఉన్న కార్యకర్తలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితి ఇప్పటిది కాదు.
స్వర్గీయ దామోదర్రెడ్డి చివరి వరకు కాంగ్రెస్ జెండాను గట్టిగా పట్టుకుని కార్యకర్తల కోసం తన సర్వస్వం త్యాగం చేసిన నాయకుడిగా జిల్లా రాజకీయా ల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ విషయాన్ని ప్రతిపక్ష నేతలు సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితి. అనేక గ్రూపులు ఉన్నా ఒక్క తాటిపై నిలబడి ఉన్న నాయకుడిగా ‘దామన్న’కు ప్రత్యేక స్థానం ఉందన్నది అందరి అభిప్రాయం. ఆయన కాంగ్రెస్ను వదిలి మరో పార్టీ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్నది చెప్పాల్సిన విషయం.గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో పాత కాంగ్రెస్ మళ్లీ తిరిగివచ్చిందా? అన్న భావన ప్రజల్లో ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కలుపుపోతేనే… చైర్మన్ పీఠం :
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉన్న నాయకుడే ఎమ్మెల్యేగా రాజకీయ పెత్తనం చెలాయించే పరిస్థితి ఉందన్నది పట్టణ ప్రజల మాట. జగదీశ్వర్రెడ్డి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా గెలవడంతో పాటు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోనూ కీలకం గా మారడంతో, జిల్లా కేంద్రంలో అధికారంలోకివచ్చే వారే రాజకీయాలను శాసించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు పటేల్ రమేష్రెడ్డి ఇప్పటికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగు తున్నారు. దామన్న కుడిభుజంగా ఉన్న కొప్పుల వేనారెడ్డి త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.
సర్వోత్తం రెడ్డి, పోతు భాస్కర్ లను మినహాయిస్తే, మిగతా కాంగ్రెస్ నాయకులంతా ఏదో ఒక విధంగా పదవుల్లో ఉన్నారన్నది గమనార్హం. అందరినీ కలుపుకుని ముందుకు సాగితే, దామన్న వర్గం మున్సిపల్ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిం చే అవ కాశం ఉందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. అలా కాకుండా వర్గా లుగా విడిపోయి పరస్పరం పోటీ పడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
