Friday, October 3, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంKomatiwani Kunta | కోమటివాని కుంట క‌బ్జా..

Komatiwani Kunta | కోమటివాని కుంట క‌బ్జా..

  • కొద్దిపాటి వర్షానికే ముంపున‌కు గుర‌వుతున్న ప‌లు ప్రాంతాలు
  • మేడ్చల్ జిల్లా, నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆక్ర‌మ‌ణ‌లు
  • సర్వే నెం. 598, 599, 551 కొంత భూమి క‌బ్జా..
  • ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో వాణిజ్య సముదాయాలు
  • ప్రేక్ష‌క‌పాత్రలో ఇరిగేష‌న్‌, రెవెన్యూశాఖ అధికారులు
  • క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటున్న స్థానిక ప్ర‌జ‌లు

మేడ్చల్ మల్కాజిరి జిల్లా కీసర మండలం, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు కొద్దిపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కోమటివాని కుంట (సర్వే నెం. 598, 599) మరియు కోపుల కుంట (సర్వే నెం. 551) కబ్జాలకు గురికావడమేనని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు. ఈ కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో, లోతట్టు ప్రాంతాలైన కాలనీలు నిత్యం నీట మునుగుతూ ప్రజలకు నరకం చూపిస్తున్నాయి.

నీటి ప్రవాహానికి అడ్డంకులు
కోమటివాని కుంట ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లలో వాణిజ్య సముదాయాలు, షెడ్లు నిర్మించడం వల్ల వరద నీరు నాగారం ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా, కోమటివాని కుంట నుండి సర్వే నెం. 17లోని దాయర కుంటలోకి వెళ్లే సహజ నీటి ప్రవాహ మార్గంలో లేఅవుట్లు వేసి ఇళ్లను నిర్మించారు. ఈ స్థలాలు తెలియక కొనుగోలు చేసిన ప్రజలు వర్షం పడిన ప్రతిసారీ తమ ఇళ్లు మునగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

స్థానికుల డిమాండ్లు
వరద నివారణ కోసం కాలనీల మధ్య నుండి అండర్‌గ్రౌండ్ ద్వారా నీటిని మళ్లించే ప్రతిపాదనను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి బదులుగా, నాగారం ప్రధాన రహదారి గుండా నిర్మాణం చేపట్టి, అన్నరాయిని చెరువు నుండి వచ్చే కాలువలోకి నీటిని మళ్లించాలని వారు కోరుతున్నారు.

ఈ సమస్యపై హైడ్రా, కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం కుంట విస్తీర్ణాన్ని డిమార్కేష‌న్ చేసి, కోమటివాని కుంట ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను తొలగించి, కాలనీలలోకి నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ చర్యలు తీసుకుంటేనే తమకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బాధితులు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News