Tuesday, March 10, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంTextile Fraud | మెరిసేవన్నీ పట్టు చీరలు కావు

Textile Fraud | మెరిసేవన్నీ పట్టు చీరలు కావు

  • విద్యుత్ కాంతుల వెనుక దాగున్న చీకటి కోణం..
  • దో నెంబర్ దందాతో దోపిడి..
  • రంగు రంగుల దుస్తుల్లో రసాయనాలు..
  • ఒకే పేరుతో ఎన్నో దుఖాణాల నిర్వహణ..
  • డిస్కౌంట్ల పేరుతో అంతులేని దగా..
  • వస్త్ర వ్యాపారంలో కళ్లుచెదిరే మాయాజాలం..
  • ఒకే షాపు యజమాని అనేక పేర్లతో షాపుల నిర్వహణ..
  • ఈ దందా వెనుక పొలిటికల్ పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం..!
  • ప్రత్యేక వరుస కథనాలు అందించనున్న ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

వస్త్ర వ్యాపారం.. దీనికి ఒక సీజన్ అంటూ ఏమీ లేదు.. ఎందుకంటే కడుపునింపుకోవడంతో పాటు శరీరాన్ని అందంగా కప్పుకోవాలనుకోవడం ప్రతి ఒక్కరి ఆశ.. వస్త్రధారణతో అందంగా కనిపించాలనే తాపత్రయం అందరిలోనూ ఉంటుంది.. మరీ ముఖ్యంగా స్త్రీలు.. సందర్భానికి తగ్గట్టు బట్టలు ధరించడం పూర్వకాలంనుంచే వస్తోంది.. రాజుల కాలంలో రాణులు, రాజనర్తకిలు ఇలా ప్రతివారూ తమ దుస్తుల ఎంపికలో ఎన్నెన్నో జాగ్రత్తలు వహిస్తారు.. పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నం చేస్తారు.. దుస్తులపై మమకారాన్ని తమకు అనువుగా మలుచుకుంటున్నారు వస్త్ర వ్యాపారస్తులు..

ఆకర్షించే డిస్కౌంట్లను ప్రకటిస్తూ.. జిగేలుమని మెరిసిపోయే దుఖాణాలను ఏర్పాటు చేసుకుని, రంగు రంగుల ఆకర్షణీయమైన దుస్తులు చూపిస్తూ తమ వ్యాపారాలను దిగ్విజయంగా, మూడు పూవులు ఆరు కాయల్లా నిర్వహిస్తున్నారు.. కానీ ఈ వ్యాపారం వెనుక ఎవరికీ అర్ధం కానీ చీకటి కోణం దాగుంది.. రూపాయల విలువ చేసే దుస్తులను వేలల్లో విక్రయిస్తున్నారు.. అది గమనించకుండా అమాయకులు కొనేస్తూ తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు.. ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడింపజేసే అందమైన దుస్తుల మాటున దాగిన కుట్రకోణం గురించి తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..

- Advertisement -

ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి.. బట్టల దుకాణాల్లో, ముఖ్యంగా చీరల సెక్షన్లలో విపరీతమైన ఫోకస్ లైట్లు, పసుపు పచ్చని కాంతులు ఉంటాయి. దీని వెనుక పెద్ద వ్యాపార తంత్రం ఉంది.. ఈ లైట్ల వెలుతురులో తక్కువ నాణ్యత గల రంగులు కూడా ఎంతో ప్రకాశవంతంగా, ఖరీదైనవిగా కనిపిస్తాయి. అదేవిధంగా వస్త్రంపై ఉన్న చిన్న చిన్న లోపాలు, అతుకులు ఈ వెలుతురులో కంటికి కనిపించవు.. దుకాణంలో మెరిసిపోయిన చీర, ఇంటికి వచ్చి సాధారణ ఎండలో చూస్తే వెలవెలబోతూ కనిపిస్తుంది. ఇది కేవలం ఆ కాంతి మన కళ్ళను మోసం చేసిన మాయ మాత్రమే..

అయితే తిరిగి మనం దుఖాణానికి వెళ్లి నిలదీయాలంటే కుదరదు ఎందుకంటే అక్కడ ఒక బోర్డు ఉంటుంది.. నో ఎక్స్ చేంజ్ అని.. చేసేది ఏమీ లేక బాధపడతాం.. ఇక మరో దుర్మార్గం ఏమిటంటే వస్త్రాలకు నిగారింపు తేవడానికి, పట్టు చీరలకు మెరుపు ఇవ్వడానికి తయారీదారులు ప్రమాదకరమైన రసాయనాలను వాడుతున్నారు. చౌకబారు రంగులలో ఉండే ‘అజో డైస’ వంటి రసాయనాలు చర్మానికి తగిలినప్పుడు అలర్జీలు, దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. అంతే కాదు స్వచ్ఛమైన పట్టు లేదా కాటన్ అని చెప్పి, అందులో నైలాన్ లేదా పాలిస్టర్‌ను కలిపి రసాయనాలతో పాలిష్ చేస్తారు. దీనివల్ల వస్త్రం కొత్తలో మెరుస్తుంది కానీ, ఒక్క ఉతుకుతోనే దాని అసలు స్వరూపం బయటపడుతుంది.

ఇక మరో దుర్మార్గమైన మోసం ఏమిటంటే.. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లను కాపీ కొట్టి, నాసిరకం వస్త్రాలను అధిక ధరలకు విక్రయించడం ఈ ‘దో నెంబర’ వ్యాపారంలో ప్రధాన భాగం. గుజరాత్, సూరత్ వంటి ప్రాంతాల నుండి తక్కువ ధరకు వచ్చే ‘రిజెక్టెడ’ స్టాక్‌ను తెచ్చి, షోరూమ్‌లలో భారీ డిస్కౌంట్లు (70శాతం నుంచి 80 శాతం ) ఇస్తాం అంటూ భారీ ఎత్తున, సెలెబ్రిటీలతో ప్రకటనలు గుప్పించి కస్టమర్లను ఆకర్షిస్తారు. అది తెలుసుకోలేక వారి మాయలో పడిపోతుంటాం..

ఇక ఈ దుఖాణాలు నిర్వహించే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, ఏసీలు చూసి అబ్బో అనుకుంటాం.. కానీ అవి సురక్షితం అనుకోవడం భ్రమ. ప్రస్తుతం అనేక మాల్స్‌లో కనీస భద్రతా ప్రమాణాలు మృగ్యమవుతున్నాయి. చాలా దుకాణాల్లో అగ్నిమాపక యంత్రాలు పని చేయవు. అత్యవసర ద్వారాలు స్టాక్ రూమ్‌లుగా మారిపోయి మూసుకుపోయి ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ దగ్గరి నుండి క్యారీ బ్యాగుల వరకు ప్రతిదానికీ అక్రమంగా వసూళ్లు చేయడం సర్వసాధారణమైపోయింది.

కనుక వినియోగదారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. డ్రెస్సులు కొనేముందు దుకాణం లోపల ఉండే ఫోకస్ లైట్ల కింద కాకుండా, సాధారణ వెలుతురులో లేదా కిటికీ దగ్గర పెట్టి రంగును చూడండి. బట్టల నాణ్యతను తెలిపే ఫ్యాబ్రిక్ కంటెంట్, వాషింగ్ సూచనలు జాగ్రత్తగా చదవండి. మాల్‌లోకి వెళ్లినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటు ఉందో ఒకసారి గమనించడం ముఖ్యం.. అది మీ ప్రాణాలకు రక్షణ కలుగుతుంది.. మోసపోయినట్లు గుర్తిస్తే వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించడానికి పక్కా బిల్లు అవసరం కనుక బిల్ తీసుకోవడం మరచిపోకండి..

మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లు, రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయే షోరూమ్‌లన్నీ నాణ్యమైనవి కావు. అప్రమత్తతే వినియోగదారుడికి శ్రీరామరక్ష. ఇప్పుడు చెప్పుకున్నది అంతా ఒక చిన్న విషయం మాత్రమే.. వస్త్ర దుఖాణాల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు.. భారీ మోసాలు.. లెక్కనేనన్ని ఉన్నాయి.. ఆర్.ఎస్. బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్, చందాన బ్రదర్స్, కళానికేతన్, మాంగళ్య షాపింగ్ మాల్ , కళామందిర్ లాంటి మెగా షాపింగ్ మాల్స్ నిర్వహణ, వారు చేస్తున్న చీకటి మోసాలు.. అమాయకులు మోసపోకుండా ఈ మోసాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకురానుంది

ఆదాబ్ హైదరాబాద్ ” ” మా అక్షరం అవినీతిపై అస్త్రం “..

- Advertisement -
RELATED ARTICLES

Latest News