కాంగ్రెస్ పార్టీలోకి లక్ష్మీదేవిపల్లి సర్పంచ్, వార్డ్ సభ్యులు
కరీంనగర్, డిసెంబర్ 16 (ఆదాబ్ హైదరాబాద్): కాంగ్రెస్ పార్టీ(Congress Party)తోనే అభివృద్ధి సాధ్యమని చొప్పదండి ఎమ్మెల్యే (Choppadandi Mla) మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) సర్పంచ్ (Sarpanch) బాసవేణి శ్రీనివాస్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంగాధర ప్రజా కార్యాలయంలో ఎమ్మెల్యే.. కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలులో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలుచేస్తోందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో గంగాధర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, సాయి గౌడ్, పవుల్ తదితరులు పాల్గొన్నారు.
