చార్లెస్ ఫిలిప్ (సీపీ) బ్రౌన్ తెలుగు భాష(Telugu Language)కు ఎనలేని సేవ (Excellent Service) చేశారు. ఈస్టిండియా కంపెనీ ఉద్యోగి(East India Company Employee)గా మన దేశానికి వచ్చి విధి నిర్వహణ కోసం తెలుగు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ఆరిపోవడానికి సిద్దంగా ఉన్న తెలుగు భాషోద్ధరణకు ప్రశంసనీయమైన చొరవ తీసుకున్నారు. తెలుగు సాహిత్య వికాసానికి అద్బుతమైన కృషి చేశారు. ఆంగ్ల పురాణాలను ప్రచురించారు. వ్యాఖ్యానాలు రాశారు. తెలుగు నేర్చకోవడం కోసం వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసి ప్రచురించారు. సహస్రాధిక వేమన పద్యాలను వెలికితీసి పబ్లిష్ చేశారు. పాఠశాలలను స్థాపించి ఉచిత విద్య నేర్చుకునే అవకాశం కల్పించారు. ప్రాచీన గ్రంథాలను అర్ధంచేసుకోవడానికి ఏకంగా నిఘంటువు అందించారు.
1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించిన బ్రౌన్.. 1884 డిసెంబర్ 12న కన్నుమూశారు. తొలి తెలుగు శబ్దకోశాన్ని ఆయనే ప్రచురించారు. ఆ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా భావిస్తారు. బ్రౌన్ తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవుడు. ఆయన మరణానంతరం బ్రౌను కుటుంబం ఇంగ్లండ్ వెళ్లిపోయింది. తండ్రి స్ఫూర్తితో సీపీ బ్రౌన్.. గ్రీక్, లాటిన్, పార్సీ, సంస్కృత భాషల్లో ఆరితేరారు. హిందూస్థానీ భాష నేర్చుకొని 1817 ఆగష్టు 4న మద్రాసులోని ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించారు.
1820 ఆగస్టులో కడప డిప్యూటీ కలెక్టర్(Kadapa Deputy Collector)గా చేరారు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పుడు తెలుగు మాట్లాడటం తప్పనిసరి. కానీ.. తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయ విధానం లేకపోవడం వల్ల పండితులు తన సొంత పద్ధతుల్లో బోధించేవారు. తెలుగేతరులు ఇలా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఇదే.. బ్రౌన్‌ను తెలుగు భాషా పరిశోధనకు పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రజలందరికీ అర్థమయ్యేలా మార్చి ప్రచురించారు. ఇది.. భాషకు వ్యాకరణం, నిఘంటువు ఏర్పడటానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైన చోట్ల పనిచేసిన బ్రౌన్.. 1826లో మళ్లీ కడపకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
కడప, మచిలీపట్నంలలోనూ పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించారు. విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కూడా కల్పించారు. 1834లో ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇంగ్లండ్ వెళ్లి తిరిగి 1837లో కంపెనీలో పర్షియన్ అనువాదకుడిగా భారతదేశానికి వచ్చాడు. 1827 నాటికే బ్రౌన్.. ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాశారు. అయితే ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం మాత్రం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ ఐదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇందులో దాదాపు 700 పద్యాలకు ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమైన పదకోశం సమకూర్చారు. పదేళ్ల తర్వాత 1164 పద్యాల వరకు విస్తరింపచేశారు. తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు. పదవీ విరమణ తర్వాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు నేలటూరు వేంకటాచలం.. తాతాచారి అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. ఆయన కథలను విన్న బ్రౌన్.. అందులోని 24 కథలను, శ్రీకృష్ణమాచారి చెప్పిన 2 కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. 1916లో ‘తాతాచారి కథలు’.. గిడుగు వేంకట అప్పారావు సంపాదకత్వంలో ద్వితీయ ముద్రణ పొందాయి. 1951లో వావిళ్లవారి తృతీయ ముద్రణ, 1974లో బంగోరె సంపాదకుడిగా చతుర్థ ముద్రణ పొందాయి. 1848లో చెన్నపట్నం వెళ్లి బ్రౌన్ కొలువులో ఏడేళ్లు పల్నాటి వీర చరితం, వసు చరిత్ర మొదలైన గ్రంథాల పరిష్కార కృషిలో ఆయనకు సాయపడ్డారు. తాతాచార్యులు కావ్య తర్క వ్యాకరణాల్లో ప్రవీణత గలవారు. తాతాచారి కథలు నీతి బోధనలే కాక ఆనాటి సామాజిక స్థితికి దర్పణంగా ఉన్నాయి.
బ్రౌన్.. వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించారు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు పబ్లిష్ చేశారు. 1841లో “నలచరిత్ర”ను ప్రచురించారు. “ఆంధ్ర మహాభారతము”, “శ్రీమద్భాగవతము”లను పబ్లిష్ చేశారు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాశారు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించారు. లండన్‌లోని “ఇండియా హౌజ్ లైబ్రరీ”లో పడి ఉన్న 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించారు. “హరిశ్చంద్రుని కష్టాలు”కు వ్యాఖ్యానం రాయించి 1842లో ప్రచురించారు. 1844లో “వసు చరిత్ర”‘, 1851లో “మను చరిత్ర” పబ్లిష్ చేశారు. జూలూరి అప్పయ్య శాస్త్రి వీటికి వ్యాఖ్యానాలు రాయించారు. 1852లో “పలనాటి వీరచరిత్ర” ప్రచురించారు.
19వ శతాబ్ది తొలి చివర్లో తాను తెలుగు సాహిత్యంలో కృషి మొదలుపెట్టే నాటికి నెలకొని ఉన్న స్థితిగతుల గురించి బ్రౌన్ స్పష్టంగా ఇలా చెప్పారు.. ‘అప్పటికి తెలుగు సాహిత్యం కొనప్రాణంతో కొట్టుకులాడుతోంది. 1825 నాటికి ప్రమిదలో దీపం కొడిగట్టిపోతోంది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండటం నా కళ్లబడింది. నేను 30 ఏళ్లు కృషి చేసి దాన్ని పునఃప్రతిష్ట చేశాను’ అని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఇతోధిక సేవలు అందించి, మరచిపోలేని కృషి సల్పిన బ్రౌన్.. 1884 డిసెంబర్ 12న తన స్వగృహం 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్‌లో అవివాహితుడి గానే మరణించారు. ఆయన్ని కెన్సెల్ గ్రీన్ స్మశానంలో సమాధి చేశారు.
(డిసెంబర్ 12న చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వర్ధంతి సందర్భంగా)
- రామకిష్టయ్య సంగనభట్ల
