- బెల్టు షాపుల బెల్ట్ తీయండి
- ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండాలి
- అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
లిక్కర్ ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, బెల్టు షాపుల ఊసే లేకుండా చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బెల్టు షాపులపై చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశర చేశారు. ఆదాయం కాదని.. ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలని వ్యాఖ్యానించారు. లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పున:పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండాలని స్పష్టం చేశారు.
బెల్టు షాపుల నియంత్రణకు హర్యానా మోడల్పై అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె. శంకరరావు కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదానికి పంపించారని ప్రస్తావించారు. ఏపీలో కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో వారి జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని విజ్జప్తి చేశారు. తమ విజ్జప్తి పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని శంకరరావు పేర్కొన్నారు.
