- విజన్‌తో ముందుకెళ్తున్నాం.. అద్భుతాలు సాధిస్తున్నాం
- అద్భుత ఐటి నగరంగా విశాఖ అభివృద్దికి కృషి
- గూగుల్ తదితర కంపెనీల రాకతో మారుతున్న ముఖచిత్రం
- కాగ్నిజెంట్ విశాఖ క్యాంపస్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు
- సీఎం విజ్ఞప్తితో 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఈఓ ప్రకటన
- కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ కంపెనీలకు శ్రీకారం
- మొత్తం రూ.3,740 కోట్ల పెట్టుబడులు, 41,700 ఉద్యోగాలు
ఒక విజన్‌తో ముందుకెళ్తూ.. అద్భుతాలు సాధిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు ఐటీ మంత్రి లోకేశ్, ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్, సత్వా సంస్థతో పాటు మరో ఏడు ఐటీ సంస్థలకు భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారబోతోందని చెప్పారు. ఎకనమిక్ రీజియన్ కింద నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాగ్నిజెంట్‌కు భారత్‌లో ఐదు సెంటర్లు చెన్నై, హైదరాబాద్, పుణె, బెంగళూరు, కోల్‌కతాలో ఉన్నాయి. హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అండ్ రిసోర్సెస్ రంగాల్లో ముందున్నారు.
భారత్ నుంచే 2,41,500 మంది కాగ్నిజెంట్ సంస్థకు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది భారతీయులే. సంస్థ చీఫ్ కూడా మన దేశానికి చెందిన వ్యక్తే.. అదీ మన భారతీయుల శక్తి. ఒకవైపు సముద్రం, మరోవైపు కొండలతో అందంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం. త్వరలో ఇక్కడికి మెట్రో కూడా వస్తుంది. అన్ని విధాలుగా అనుకూలమైన నగరమిది. ఒక విజన్‌తో ముందు కెళ్తున్నాం.. అద్భుతాలు సాధిస్తున్నాం అని చంద్రబాబు అన్నారు.కాగ్నిజెంట్ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఐటీ సంస్థల పెట్టుబడులతో విశాఖకు మరింత వెలుగు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారాం. రాయితీ ప్యాకేజీపై నిన్నటి మంత్రివర్గంలో కూడా చర్చించాం.

మౌలిక సదుపాయాల కల్పనలో ఒక అడుగు ముందున్నాం. రియల్‌టైమ్‌లో కార్యకలాపాలు ప్రారంభం కావడమే మాకు కావాల్సింది. గత 18 నెలల నుంచి అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వాటికి వెంటనే భూ కేటాయింపులు జరగుతున్నాయి. జాప్యం లేకుండా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నాం. విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టం‘అని లోకేశ్ అన్నారు. విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరుగనుంది. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది కాగ్నిజెంట్.
అప్పటి వరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలను ఆ సంస్థ కొనసాగించనుంది. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌ల ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పాల్గొన్నారు. త్వరలోనే విశాఖ నుంచి టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాప్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.
సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా విశాఖ ఎదుగుతోంది. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు ప్రారంభించడంతో విశాఖ వైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు పడిరది. ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి.
