Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిChalo Suryapet | ఛలో సూర్యపేట కార్యక్రమానికి గోడ పత్రికలు ఆవిష్కరణ

Chalo Suryapet | ఛలో సూర్యపేట కార్యక్రమానికి గోడ పత్రికలు ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2026 జనవరి 10న సూర్యపేటలో నిర్వహించనున్న ఛలో సూర్యపేట బారీ ప్రదర్శన, మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రచురించిన కరపత్రాలు, గోడ పత్రికలను మంగళవారం సాయంత్రం ఐలపు పద్మ అధ్యక్షతన ఆవిష్కరించారు.

జవహర్ నగర్ జీహెచ్ఎంసి పరిధిలోని వికలాంగుల కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇఫ్టూ షేక్ షావలి, కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ చారి, పిఓడభ్ల్యూ విముక్తి నాయకురాలు పి సునీత పాల్గొన్నారు. తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుల పక్షాన రాజకీయాలకు అతీతంగా తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి నాయకత్వంలో ఏర్పడిన టియుజేఏసి గత 18 నెలలుగా పోరాటం కొనసాగిస్తున్నదని వారు పేర్కొన్నారు. ఉద్యమకారుల న్యాయమైన, ప్రజాస్వామికమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న మహాసభకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

- Advertisement -

ఈ సందర్భంగా షేక్ షావలి మాట్లాడుతూ కవులు, కళాకారులు, విద్యార్థులు, మహిళలు సహా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నేడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేశారని గుర్తు చేశారు. ఆ కుటుంబాలు నేడు సరైన ఆదరణ లేక నిస్సహాయ స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాలతో అందలమెక్కిన వారికి పదవులు, అధికారం దక్కిందని, కానీ వేలాది ఉద్యమకారులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి కనీస వసతులు కూడ పొందలేకపోతున్నారని తెలిపారు.

పాలకులు పేరున్న కొందరికే నగదు పురస్కారాలు, సన్మానాలు చేస్తున్నారని, ప్రభుత్వ పెద్దల గౌరవం పొందిన ఉద్యమకారుల సరసన ఉన్న ఇతర ఉద్యమకారుల సమస్యలపై పల్లెత్తు మాట కూడ మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేత గుర్తింపుపొందిన ఉద్యమకారులు స్పందించాలని కోరారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటిస్థలం, నెలకు 30 వేల గౌరవ వేతనం, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల నగదు, ఒక్కరికైనా ఉద్యోగం వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై ఉన్న అన్ని రకాల అక్రమ కేసులు, ఉపా కేసులు ఎత్తివేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉద్యమ సంఘాలచే ఎన్నికైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని షేక్ షావలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ సైయద్, మైసయ్య, మదు, శాంతమ్మ, లక్ష్మమ్మ సహా కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News